సినిమా విజయాన్ని చెప్పాలంటే, అది కేవలం థియేటర్లలో వసూళ్లు సాధించడమే కాదు, ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయేలా ఉండాలి. సినిమా విడుదలైన ఏడాది గడిచినా, ఆ చిత్ర చర్చ ఎక్కడో ఒకచోట తప్పక వినిపిస్తుండాలి. ప్రేక్షకులకు ఆ సినిమానే మళ్లీ కొత్తగా అనిపించేలా మంత్ర ముగ్ధులను చేయాలి. ఇలాంటి విజయాన్ని సాధించింది యానిమల్ సినిమా.ఈ చిత్రం విడుదలై ఒక సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా, యూనిట్ ప్రత్యేక వీడియోను విడుదల చేసి విజయాన్ని సెలబ్రేట్ చేస్తోంది. ఈ వీడియోలో సినిమా మొత్తం రివైండ్ చేస్తున్నట్టుగా అనిపించి, ప్రేక్షకులను మళ్లీ ఒకసారి అద్భుతమైన అనుభవంలోకి తీసుకెళ్తుంది. “లెట్స్ ఎండ్ ద డే ఆన్ ఎ హై నోట్” అంటూ మేకర్స్ ఈ వీడియోను షేర్ చేశారు.
ఈ చిత్రంలో రష్మిక మందన్న గీతాంజలి అనే పాత్రలో నటించారు, రణ్ బీర్ కపూర్ భార్యగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రష్మిక మాట్లాడుతూ, డిసెంబర్ తనకు ఎంత ప్రత్యేకమో తెలిపారు. ఆమె నటించిన పుష్ప, యానిమల్, పుష్ప 2 చిత్రాలన్నీ డిసెంబర్‌లోనే విడుదల కావడం ఈ సందర్భంగా చర్చనీయాంశంగా మారింది.ఈ సినిమాలో బాబీ డియోల్ ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది. యానిమల్ ద్వారా ఆయన ఒక్కసారిగా పాన్-ఇండియా నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఉత్తరాది మాత్రమే కాకుండా, దక్షిణాది ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్నారు. బాబీ డియోల్ పాత్రను సందీప్ రెడ్డి వంగా డిజైన్ చేసిన తీరుకు జనాలు ఫిదా అవుతున్నారు.
ఇప్పుడంతా యానిమల్ టీం సెలబ్రేషన్ మోడ్‌లో ఉండగా, అభిమానులు మాత్రం యానిమల్ పార్క్ గురించి ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఈ సీక్వెల్ పై ఇప్పటికే రష్మిక కూడా తన అభిప్రాయాలను వెల్లడించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం స్పిరిట్ షూటింగ్‌తో బిజీగా ఉన్నప్పటికీ, తర్వాత యానిమల్ పార్క్ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టే అవకాశం ఉందని సమాచారం. సినిమా గురించి ప్రేక్షకుల్లో ఇటువంటి చర్చలు, ఆసక్తి చూడటం దర్శకుడికి, యూనిట్‌కు సంతోషకరం. యానిమల్ ద్వారా సాధించిన ఈ విజయాన్ని మరింతగా కొనసాగిస్తూ, సీక్వెల్ కోసం వేచి చూడాల్సిన సమయం ఆసన్నమైంది.