తాజాగా ప్రజల ఆరోగ్యం కోసం రూపొందించబడిన మందులు నకిలీగా తయారవుతున్నాయి అనే వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రజల ప్రాణాలను కాపాడే ఔషధాలు నకిలీగా తయారవుతున్నాయి, వాటి వాడకం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని కరకపట్ల గ్రామంలో భారీ మొత్తంలో నకిలీ యాంటీబయాటిక్స్‌ను డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. ఆర్‌ఎంపీలు (గ్రామీణ వైద్యులు) చట్టబద్ధంగా మెడిసిన్స్ అమ్మడానికి అర్హులు కానప్పటికీ, నకిలీ మందుల అమ్మకాల ద్వారా భారీ మొత్తంలో కమీషన్లు పొందుతున్నారు. ఈ నకిలీ కంపెనీలకు ఆర్‌ఎంపీలు ఒక రకంగా సేల్స్‌మెన్‌లుగా మారిపోయారు. పేషెంట్లకు బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ మందులను అందిస్తూ వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు.
డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో తనిఖీల్లో “జోడస్” అనే సంస్థ పేరు మీద 1.5 కోట్ల విలువైన నకిలీ యాంటీబయాటిక్స్ స్వాధీనం చేసుకుంది. ఈ నకిలీ మెడిసిన్స్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతుండటం కలవరపరుస్తోంది. నకిలీ మెడిసిన్ తయారీ అధిక నైపుణ్యంతో చేయబడుతోంది. ప్రముఖ కంపెనీల పేర్లు, లోగోలు ఉపయోగించి, ఒరిజినల్ ప్రొడక్ట్‌లా కనిపించేలా ప్యాకేజింగ్ చేస్తున్నారు.
బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక రోగాలకు అవసరమైన ట్యాబ్లెట్లను సుద్ద, చాక్ పౌడర్, మరియు ఇతర పదార్థాలతో తయారు చేస్తున్నారని అధికారులు నిర్ధారించారు. యూపీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల నుంచి తెలంగాణకు పెద్ద మొత్తంలో నకిలీ మెడిసిన్స్ దిగుమతి అవుతున్నాయి. కొంతమంది స్థానికంగా తయారీ యూనిట్లను కూడా ఏర్పాటు చేసి నకిలీ మందులు తయారు చేస్తున్నారు. ఈ మందులు ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా, ఆర్‌ఎంపీల ద్వారా పేషెంట్లకు చేరుతున్నాయి.
నకిలీ మందుల ప్యాకేజింగ్, అసలు మందుల మాదిరిగానే ఉండటం వల్ల వాటిని గుర్తించడం చాలా కష్టం. కొన్ని సందర్భాల్లో ల్యాబ్ పరీక్షలు చేయించి నకిలీ అని నిర్ధారించాల్సి వస్తోంది. నకిలీ మందుల వాడకం వల్ల పేషెంట్ల ఆరోగ్య పరిస్థితులు మరింత దిగజారతాయి. ముఖ్యంగా యాంటీబయోటిక్స్ విషయంలో నకిలీ మందుల వాడకం అనారోగ్య సమస్యలతో పాటు యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ పెరగడానికి దోహదపడుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు మరింత దృష్టి పెట్టాలి. నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు ప్రజలలో అవగాహన పెంచడం కూడా అవసరం. నకిలీ మందుల తయారీదారులను కఠినంగా శిక్షించాలి.