శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల పెద్దపులి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. పాతపట్నం మండలంలోని తీమర గ్రామ సమీపంలో ఓ ఆవుపై పెద్దపులి దాడి చేసింది. ఆవును సమీప తోటల్లోకి లాక్కెళ్లి తినేసిన ఆనవాళ్లను మంగళవారం అటవీశాఖ సిబ్బంది గుర్తించారు.
పులి దాడి సమాచారం అందిన వెంటనే అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. రొంపివలస గ్రామం మీదుగా కొరసవాడ వైపు పులి కదలికలను గుర్తించారు. పులి అడుగుజాడలను ట్రాక్ చేస్తూ తదుపరి మార్గాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో స్థానిక ప్రజలలో ఆందోళన నెలకొంది. పశువులను దట్టమైన ప్రాంతాల్లో మేతకు పంపడం స్థానిక రైతులు ఆపేశారు. పిల్లలను ఒంటరిగా బయటకు పంపకూడదని కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పాతపట్నం అటవీశాఖ రేంజ్ అధికారి అమ్మన్నాయుడు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి సంచారంపై దృష్టి ఉంచి, ఎలాంటి అనుమానాస్పద చలనాలను వెంటనే అటవీశాఖకు తెలియజేయాలని కోరారు. పులి సంచారానికి కారణంగా పశువుల రక్షణ, గ్రామీణ ప్రాంతాల భద్రతపై దృష్టి పెట్టాలని స్థానికులు అటవీ శాఖను కోరుతున్నారు. పెద్దపులిని చుట్టుప్రక్కల అడవుల్లోకి తరలించేందుకు త్వరలో పటిష్ఠ చర్యలు చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు.