రతన్ టాటా ఇచ్చిన విరాళాలు ఎన్ని వేల కోట్లో తెలుసా?

ప్రముఖ పారిశ్రామిక వేత్త, వ్యాపార దిగ్గజం రతన్ టాటా బుధవారం (అక్టోబర్ 09) అర్థరాత్రి కన్నుమూశారు. టాటా గ్రూప్ అండ్ టాటా సన్స్‌కు గౌరవ్ ఛైర్మన్ గా ఉన్న ఆయన భారతదేశ పారిశ్రామిక పురోగతికి ఎంతో కృషిచేశారు. అలాగే పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. భారతదేశంలోనే అత్యుత్తమ వ్యాపారవేత్తగా పేరు పొందిన రతన్ టాటా మరణం అందరినీ కలచి వేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రతన్ టాటా మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్థించారు.

కాగా వ్యాపార దిగ్గజంగా పేరు తెచ్చుకున్న రతన్ టాటా కలియుగ దానకర్ణుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇతరులపై జాలి, దయ చూపండంటూ చెప్పే రతన్ టాటా ఆ మాటలకు ఆజన్మాంతం కట్టుబడి ఉన్నారు. టాటా గ్రూప్ లాభాల్లో 60-65 శాతం నిధులను సామాజిక బాధ్యత కింద ఖర్చు చేస్తున్నారు. దేశంలో విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, ప్రజాసంక్షేమ కార్యక్రమాల కోసం ఆయన ఇప్పటివరకు రూ.9వేల కోట్లు విరాళంగా ఇచ్చారు.

సినిమాలంటే ఇష్టం ఉన్న ఆయన ఓ సినిమా కూడా నిర్మించారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన ఏత్ బార్ అనే చిత్రానికి రతన్ టాటా నిర్మాతగా వ్యవహరించారు. నిజానికి ఈ సినిమాకు నలుగురు నిర్మాతలు ఉన్నారు. వారిలో రతన్ టాటా ఒకరు. జతిన్ కుమార్, ఖుష్రు బుద్రా, మన్‌దీప్ సింగ్ కూడా ఈ చిత్రానికి పెట్టుబడి పెట్టారు. అయితే రతన్ టాటానే ఈ చిత్రానికి ప్రధాన నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా 2004లో విడుదలైంది. 1992లో వచ్చిన హాలీవుడ్ సినిమా ‘ఫియర్’ స్ఫూర్తితో ఏత్ బార్ సినిమా తెరకెక్కింది. విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *