చెన్నై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అస్వస్థతకు గురయ్యారు. ఎసిడిటీ కారణంగా ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఈ మేరకు ఆర్‌బీఐ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆయనను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని, ఎలాంటి ఆందోళన చెందనక్కరలేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మరో రెండు, మూడు గంటల్లో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నదన్నారు.
కాగా, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం వచ్చే నెల 10న ముగియనుంది. 1980 తమిళనాడు క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి శక్తికాంత దాస్.. 2018 డిసెంబర్ 12న ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ తన పదవీ కాలానికి ముందే రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కేంద్రం శక్తికాంత దాస్‌ను నియమించింది. అప్పటి నుంచి ఆయన పదవిలో కొనసాగుతున్నారు. 2021 డిసెంబర్ 10న మూడేళ్ల పదవీ కాలం ముగిసినప్పటికీ మరో మూడేండ్ల పాటు పదవీకాలన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ ప్రకారం వచ్చే నెల డిసెంబర్‌తో ఆయన పదవీ కాలం ముగుస్తుంది. అయితే, మరోసారి ఆయన్ని ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఐదేండ్ల కంటే ఎక్కువకాలం ఆర్బీఐ గవర్నర్‌గా దాస్ ఉన్నారు. మరోసారి ఆయన పదవీకాలం పొడిగిస్తే.. బెనగల్ రామారావు తర్వాత అత్యధిక కాలం ఆర్బీఐ గవర్నర్‌గా చేసిన వ్యక్తిగా దాస్ నిలవనున్నారు. రామారావు 1949-1957 మధ్య ఏడున్నర సంవత్సరాల పాటు ఆర్బీఐ చీఫ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పటివరకు ఆయనే అత్యధిక కాలం ఆ పదవిలో ఉన్నారు. ఇప్పుడు ఆయన తర్వాత అత్యధిక కాలం ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన వ్యక్తిగా దాస్ నిలవనున్నారు.