ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ధరలపై కీలక నిర్ణయాలు తీసుకుంటూ మద్యం బాబులకు గుడ్ న్యూస్ అందిస్తుంది. 3 బ్రాండ్ల మద్యం ధరలు తగ్గించింది. రాయల్ ఛాలెంజ్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర రూ. 230 నుంచి రూ.210కి, ఫుల్ బాటిల్ రూ.920 నుంచి రూ.840కి తగ్గింది. మాన్షన్హస్ క్వార్టర్ రూ.220 నుంచి రూ.190కి, ఫుల్ బాటిల్ రూ.870 నుంచి రూ.760కి, యాంటిక్విటీ విస్కీ ఫుల్ బాటిల్ రూ.1,600 నుంచి రూ.1,400కు తగ్గించి అమ్ముతోంది. త్వరలోనే మరో 2 కంపెనీల ధరలు తగ్గిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే చీప్ లిక్కర్ క్వార్టర్ ప్రభుత్వం రూ.99 రూపాయలకు అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఏపీలో గత ప్రభుత్వం నాణ్యమైన మద్యం దొరకకపోవడంతో మద్యం ప్రియులు ఎంతో ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో దశలవారిగా మద్య నిషేదం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇచ్చిన మాట తప్పింది. అంతే కాకుండా మద్య నిషేదంవైపు అడుగులు వేయకుండా కొత్త బ్రాండ్లను పరిచయం చేసింది. నాణ్యత లేని బ్రాండ్లను తీసుకువచ్చి వాటికి భారీగా రేట్లు నిర్ణయించడంతో కొంతమంది పొరుగు రాష్ట్రాలకు వెళ్లినప్పుడే మద్యం తాగే పరిస్థితి వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తాము అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న మద్యం బ్రాండ్ల అనుమతులు రద్దు చేసి నాణ్యమైన నేషనల్ , ఇంటర్నేషనల్ బ్రాండ్లను అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చింది. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా ధరలు నిర్ణయిస్తామని చెప్పింది. ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ప్రభుత్వం ఆ దిశగా ఇప్పుడు అడుగులు వేస్తోంది.
ప్రస్తుతం మద్యం దుకాణాల్లో పాత ధరలతో ఉన్న వాటిని అదే ధరలకు విక్రయించి కొత్తగా వచ్చే వాటికి తగ్గించిన దరలతో విక్రయిస్తారని మద్యం దుకాణాల యజమానులు చెబుతున్నారు. ఐదేళ్లలో ప్రముఖ బ్రాండ్లు మందుబాబులకు అందుబాటులో ఉండేవి కావు. ధరలు కూడా అధికంగా ఉండేవి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చారు.