కాన్బెర్రా: ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్-3కు షాక్ ఎదురైంది. ఆ దేశానికి అధికారికంగా పాలకుడైన ఆయన సోమవారం పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడటం పూర్తయిన వెంటనే స్థానిక ఆదివాసీ సెనెటర్ లిడియా థోర్పే రాచరికానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ”మా భూమిని తిరిగి ఇచ్చేయండి. మా నుంచి దోచుకొన్నవి మొత్తం వాపస్ ఇవ్వండి. ఇది మీ భూమి కాదు.. మీరు మా రాజూ కాదు. ఆస్ట్రేలియా ఆదివాసీలపై ఐరోపా వలసదారులు నరమేధానికి పాల్పడ్డారు” అని ఆమె దాదాపు నిమిషం పాటు పెద్దపెద్దగా కేకలు వేశారు. వలస విధానాన్ని థోర్పే ఎప్పుడూ వ్యతిరేకిస్తారని పేరుంది.
2022లో థోర్పే ప్రమాణ స్వీకార సమయంలో కూడా వలస రాజ్యపాలకురాలంటూ క్వీన్ ఎలిజిబెత్-2ను అభివర్ణిస్తూ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో నాటి ఛాంబర్ ప్రెసిడెంట్ సు లిన్స్ ఆమెను ఉద్దేశించి ”సెనెటర్ థోర్పే.. మీరు ప్రమాణస్వీకారం కార్డులో ప్రచురించిన అంశాన్ని మాత్రమే చదవాలి” అని సరిచేశారు.
ఆస్ట్రేలియా రాణి హోదా నుంచి క్వీన్ ఎలిజిబెత్-2ను తప్పించి.. పార్లమెంట్ సభ్యులు ఎన్నుకొన్నవారిని నియమించేలా 1999లో ఓటింగ్ జరిగింది. నాడు స్వల్ప మెజార్టీతో ఈ తీర్మానం వీగిపోయింది. మరోవైపు దేశంలో ఆదివాసీ కన్సల్టేటీవ్ అసెంబ్లీ ఏర్పాటుకు తీర్మానాన్ని కూడా 2023లో పార్లమెంట్ భారీ మెజార్టీతో తిరస్కరించింది.
ఆస్ట్రేలియా దాదాపు 100 ఏళ్లకు పైగా బ్రిటన్ వలస రాజ్యంగా ఉంది. ఈ సమయంలో వేలమంది ఆదివాసీ ఆస్ట్రేలియన్లు హత్యలకు గురయ్యారు. ఆ తర్వాత 1901లో ఆ దేశం అప్రకటిత స్వాతంత్ర్యం సాధించింది. కానీ, పూర్తిస్థాయి రిపబ్లిక్‌గా ఏర్పడలేదు. ప్రస్తుతం దానికి కింగ్‌ఛార్లెస్-2 రాజుగా వ్యవహరిస్తున్నారు. ఆయన తాజాగా ఆస్ట్రేలియా, సమవో దేశాల్లో తొమ్మిది రోజుల పర్యటన మొదలుపెట్టారు.