దివంగత రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. రతన్ టాటాను కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ2 సర్కార్ 2008లో పద్మ విభూషణ్ పురస్కారం ఇచ్చి సత్కరించింది. అయితే దేశ అత్యున్నత పౌరపురస్కారం అయిన భారతరత్న అవార్డును రతన్ టాటాకు ఇవ్వాలని ఆ తర్వాత దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపించాయి. దేశానికి ఆయన చేసిన సేవలు, దేశ అభివృద్ధి కోసం టాటా గ్రూప్ చేసిన ఎన్నో కార్యక్రమాలకు గుర్తుగా ఆయనకు భారతరత్న ఇవ్వడమే సరైంది అని ఎంతోమంది బహిరంగంగానే ప్రకటనలు చేశారు. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగి ఉండే వ్యక్తిత్వం కలిగిన రతన్ టాటా.. ఇలాంటి ఆడంబరాలను ప్రోత్సహించేవారు కాదు. ఇక తనకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్లు వెల్లువెత్తిన వేళ.. ఒక సందర్భంలో దానిపై ఆయన స్పందించారు.
ఇలాంటి డిమాండ్లు, ప్రచారం వెంటనే ఆపేయాలని రతన్ టాటా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టిన రతన్ టాటా.. భారతీయుడిగా పుట్టడమే తాను చేసుకున్న అదృష్టంగా భావిస్తానని పేర్కొన్నారు. అంతేకాకుండా.. దేశ అభివృద్ధిలో, దేశ సంపద పెరగడంలో తన వంతు సహకారం అందించినందుకు ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు.
ఇక ఇప్పుడు ఆయన మరణంతో మరోసారి రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని దేశ వ్యాప్తంగా డిమాండ్ వస్తుంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. ఈరోజు నిర్వహించే క్యాబినెట్ భేటీలో ఈమేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించనుంది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది.