న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహన కాండను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన తాజా చిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్’. ఈ చిత్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు వీక్షించనున్నారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లోని బాలయోగి ఆడిటోరియం లో సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ స్క్రీనింగ్‌కు ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు సభ్యులు హాజరుకానున్నట్లు తెలిసింది.
కాగా, 2002లో ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోద్రా రైల్వేస్టేషన్ నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లేందుకు సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరుతుండగా ఎవరో చైన్ లాగడంతో రైలు నిలిచిపోయింది. ఒక్కసారిగా కొన్ని బోగీలపై రాళ్ల వర్షం మొదలైంది. ఎవరో దుండగులు ఓ బోగీపై పెట్రోల్ చల్లి నిప్పు పెట్టారు. దాంతో ఆ బోగీలోని 59 మంది సజీవదహనమయ్యారు. ఈ రైలు అయోధ్య నుంచి తిరిగి వస్తున్న యాత్రికులతో ఉంది. ఆ ఘటనను ఆధారంగా చేసుకుని బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ సర్నా ‘ది సబర్మతి రిపోర్ట్’ను తెరకెక్కించారు.
12th Fail మూవీ ఫేమ్ విక్రాంత్ మాస్సే, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నవంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై మోడీ ఇప్పటికే ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. కల్పిత కథనాలు పరిమిత కాలమే కొనసాగుతాయని అన్నారు. సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.