మూసీ పరివాహక ప్రాంతాల్లో “బీజేపీ మూసీ నిద్ర” కార్యక్రమం ప్రారంభమైంది. తెలంగాణ రాజకీయాల్లో మూసీ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. మూసి సుందరీకరణ పేరుతో మూసి వాసుల ఇళ్లను కూల్చడం..అక్కడి ప్రజలను మరోచోటుకు తరలించడం పట్ల బిఆర్ఎస్ తో పాటు బిజెపి వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్న వారిని సడెన్ గా ఇక్కడి నుండి వేరే చోటికి వెళ్ళమని చెప్పడం..ఇల్లు కూల్చేస్తాం అంటే ఎలా అని వారంతా ప్రశ్నించారు. అయితే సియోల్ తరహాలో హైదరాబాద్‌లో మూసీని పునరుజ్జీవింపజేస్తామంటూ తెలంగాణ లోని రేవంత్ సర్కార్ చెబుతోంది. మూసీ పునరుజ్జీవానికి అడ్డుపడితే బుల్జోజర్లతో తొక్కిస్తామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.
రేవంత్ కామెంట్స్‌కు బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మూసి ప్రాంతం పేదలకు మనోధైర్యం కల్పిందేందుకు, వారికి అండగా ఉంటానని కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సీఎం వ్యాఖ్యలను తప్పుబట్టిన కిషన్ రెడ్డి.. బుల్డోజర్లు వస్తే చావడానికైనా సిద్ధమేనని చెప్పారు. ఈ క్రమంలోనే మొన్న మూసి వద్దా నిద్రపోగలరా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ను స్వీకరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దానికి తగినట్లుగా మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నిద్ర కార్యక్రమం చేపట్టారు. ఈ రోజు రాత్రి అంబర్పేట్ తులసి రామ్ నగర్ మూసి పేదల నివాసం ప్రాంతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా ముఖ్యనేతలు బస్తీ నిద్ర చేసేందుకు సిద్ధమయ్యారు. మూసీ నది వెంట 21 ప్రాంతాల్లో వారు రాత్రి బస చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర బొగ్గు, గణుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అంబర్‌పేట నియోజకవర్గం తులసీ రామ్ నగర్ లోని మూసీ ప్రాంత ప్రజలను కలిసి, వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం ఈ రాత్రి తులసీరామ్ నగర్ లోనే కిషన్ రెడ్డి బస చేయనున్నారు. ఆయన వెంట బీజేపీ స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమ సహా ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.