తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే (Comprehensive Family Survey) ను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. గత వారం ఈ సర్వేను ప్రారంభించింది. ప్రతి రోజు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. ఈ సర్వే ప్రక్రియలో ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, మరియు అధికార కాంగ్రెస్ నేతలు పాల్గొంటున్నారు. అయితే ఈ సర్వే ఫారాలు రోడ్ల పై చిత్తూ కాగితాల్లా పడిఉండడం పై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి దాటిన తర్వాత మేడ్చల్- నిజామాబాద్ దారిలో రేకుల బావి చౌరస్తా నుంచి భారత్ పెట్రోల్ బంక్ వరకు 44వ జాతీయ రహదారి పొడవునా గురువారం సాయంత్రం పూరించని సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు పడివున్నాయి. ఈ విషయం తెలుసుకున్న మేడ్చల్ మున్సిపాలిటీ కమిషనర్ నాగిరెడ్డి హుటాహుటీన సర్వే ఫారాలు పడిన చోటుకు సిబ్బందితో కలిసి వెళ్లి అన్ని ఫారాలను సేకరించి, తన వాహనంలో కార్యాలయానికి తీసుకెళ్లారు. దేశానికే దిక్సూచి, సామాజిక న్యాయం అంటూ అత్యంత ఆర్భాటంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డుపై కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ విషయం సీఎం దృష్టికి వెళ్లడం తో దీనిపై ఆయన ఆరా తీశారు. మరోసారి రోడ్లపై కులగణన పేపర్లు కనిపించాయని, కులగణనపై ఇతర నెగిటివ్ వార్తలు కనిపించవద్దని సీఎం అధికారులను ఆదేశించినట్టు సమాచారం. మరోవైపు బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎప్పటికప్పుడు కులగణనపై రివ్యూ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో కులగణన ఏ విధంగా జరుగుతుంది? ఏ ప్రాంతాల్లో నెమ్మదిగా జరుగుతుందని ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
ఇప్పటి వరకు 44.1 శాతం సర్వే పూర్తి అయిందని సీఎం దృష్టికి అధికారులు తీసుకువెళ్లారు. 51.24 లక్షల మంది ప్రజల సర్వే పూర్తి చేశామని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. సర్వేలో 87వేల 807 మంది సిబ్బంది పాల్గొన్నారని అధికారులు సీఎంకు తెలిపారు. వీరితో పాటూ 8,788 మంది సూపర్ వైజర్లు సర్వేలో పాల్గొన్నారని చెప్పారు.