హైదరాబాద్: : తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నోటిఫికేషన్ సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు హైకోర్టు కొట్టివేసింది. ఈనెల 21వ తేదీ నుంచి యథావిధిగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.
ఇటీవలే నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో 7 ప్రశ్నలకు తుది ‘కీ’లో సరైన జవాబులు ఇవ్వలేదని పిటిషనర్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తప్పులు దొర్లిన ప్రశ్నలకు మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని వారు పిటిషన్లలో కోరారు. అయితే హైకోర్టు ఈ పిటిషన్లను కొట్టి వేసింది. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. హైకోర్టు ఈ నోటిఫికేషన్‌పై దాఖలైన రెండు పిటిషన్లను కొట్టివేయడంతో పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి.
కాగా, ఆయా కేసుల్లో ఇప్పటికే విచారణను పూర్తిచేసిన హైకోర్టు తీర్పును సోమవారానికి రిజర్వు చేసింది. అయితే తీర్పును మంగళవారం వెలువరిస్తామని ప్రకటించింది. గ్రూప్-1పై హైకోర్టులో 15కుపైగా కేసులు ఉన్నాయి. వీటిలో ఫైనల్ ‘కీ’పై వేసిన కేసు అత్యంత కీలకమైనది. వీటితోపాటు ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో-33పై దాఖలైన కేసు, గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి 503 పోస్టులు, కొత్త నోటిఫికేషన్‌లో అదనంగా చేర్చిన 60 పోస్టులకు కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి అవకాశం ఇవ్వాలన్న అంశంపై వేసిన కేసు, హైకోర్టు మళ్లీ రీ ఎగ్జామ్ నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో, పాత నోటిఫికేషన్‌ను రద్దుచేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడంపై పలువురు కేసులు వేశారు.