అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో కేబినేట్ సమావేశం జరుగనుంది. 3 ఉచిత సిలిండర్ల పథకంపై ఈ కేబినెట్‌లో చర్చ సాగనుంది. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్‌లో చర్చించనున్నారు. రాష్ట్రంలోని దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన పాలసీలపై మంత్రివర్గ భేటీలో చర్చించనున్నారు.
అలాగే పారిశ్రామిక అభివృద్ధి, ఎంఎస్ఎంఈ, ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రైవేట్ పారిశ్రామిక పార్కులకు సంబంధించిన ఆరు పాలసీలపైనా మంత్రివర్గం చర్చించనుంది. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ప్రోత్సాహకాలపైనా మంత్రివర్గంలో చర్చించనున్నారు.
అదేవిధంగా తిరుమలలో లడ్డూ కల్తీ ఘటన తర్వాత.. పాలకమండలిలో బ్రాహ్మణులుండాలన్న అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించాలన్న ఆలోచనలో ఉంది. ఈ పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.