బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ ఎంపీ రవీంద్రనాయక్ తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను, ఉద్యమకారులను మోసం చేశారని, ఆయన వల్ల ఎంతో మంది నష్టపోయారని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ కోసం కృషి చేసిన తనను కూడా తెలంగాణ భవన్ నుంచి బయటకు గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులలో ముంచాడని, ఉద్యమ పర్వంలో ఉన్నవారిని పక్కన పెట్టి వదిలేశారని విమర్శించారు.
రవీంద్రనాయక్ మాట్లాడుతూ, కేసీఆర్ గిరిజనులు, మహిళలకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని, వారిని పార్టీ నుంచి బయటకు తన్నేశారని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక క్విడ్ ప్రో పేరుతో వేలాది ఎకరాల అసైన్డ్ భూములు, నయీం, దేవాదాయ, వక్ఫ్, మిగులు భూములు కబ్జా చేశారని ఆరోపించారు. కేవలం భూములనే కాకుండా, రాష్ట్రంలోని వందలాది చెరువులు కూడా కనుమరుగయ్యాయని మండిపడ్డారు.
అదేవిధంగా, కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరు ముఖ్యమంత్రిగా అయినా తెలంగాణ నాశనం అవుతుందని హెచ్చరించారు. ఆయన కూతురు కవిత జైలుకు పాలవడానికి కూడా కేసీఆర్ కారణమని రవీంద్రనాయక్ ఆరోపించారు.
ఇదే సమయంలో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రవీంద్రనాయక్ ప్రశంసించారు. రేవంత్ రెడ్డి ప్రజా పాలనను నడుపుతున్నారని, ఆయనకు రాష్ట్ర ప్రజలు మద్దతుగా ఉండాలని సూచించారు.