ఆంధ్రప్రదేశ్ ను వరుస వర్షాలు వదలడం లేదు. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడగ..ఇప్పుడు శీతాకాలంలో కూడా వరుసగా వర్షాలు పలకరిస్తూనే ఉన్నాయి. ఈ అకాల వర్షాలతో రైతుల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఇప్పుడు అల్ప పీడన ప్రభావం తో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో తమిళనాడు, కేరళలో విస్తారంగా, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. వర్షాల కారణంగా వ్యవసాయ పనుల్లో రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విప్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.
ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యాదర్శి ఆర్.పి.సిసోడియా తెలిపారు. మృత్సకారులు వేటకు వెళ్లవద్దని, రైతులు కూడా వర్షం సమయంలో పొలాల్లో ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ నెల 23న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపారు. ఈ కారణంగా ఏపీలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. శ్రీలంక, తమిళనాడు, కేరళ వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన ఉందని చెప్పింది. ఈ నెల 26 నుంచి 3 రోజులు ఏపీ వర్షాలు కురుస్తాయంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయి.