సినీ నటుడు , వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి కీలక నిర్ణయం తీసుకున్నాడు.తాజాగా గురువారం మీడియా సమావేశం నిర్వహించిన పోసాని.. ఈ ప్రకటన చేశారు. తాను ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని.. అయితే మంచి చేసిన వారిని ప్రశంసించానని.. తప్పులు చేసిన వారిని విమర్శించినట్లు చెప్పారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తాను చాలా సార్లు పొగిడానని వెల్లడించారు. తాను రాజకీయ నాయకులు, పార్టీల తీరు, విధానాల గురించి విమర్శలు చేస్తుంటాను తప్ప.. మంచి నాయకులను ఎప్పుడూ తిట్టలేదని తెలిపారు. తన జీవితాంతం రాజకీయాల జోలికి వెళ్లనని అన్నారు. ఇన్నేళ్ల జీవితంలో తాను ఎవరికీ తల వంచలేదని ఆడవాళ్లనే ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు నన్ను తిట్టరా అని ఆవేదన వ్యక్తం చేశారు. అవేవీ తాను పట్టించుకోనని చెప్పుకొచ్చారు. ఇన్ని సంవత్సరాల పాటు తనను ఆదరించారని కానీ ఈ రోజు నుండి తాను చనిపోయేవరకు తన కుటుంబం కోసమే మాట్లాడతానని స్పష్టం చేశారు. ఏ రాజకీయ నాయకుని గురించి మాట్లాడనని చెప్పారు.
తనకు మోడీ అంటే చాలా ఇష్టమని అవసరమైతే ఆయనను పొగుడుతానని అన్నారు. వైఎస్ జగన్ అంటే తనకు చచ్చేంత అభిమానం అని ఆయన తనకు ఎంతో గౌరవం ఇచ్చారని అన్నారు. అయినప్పటికీ ఇకపై జగన్ గురించి కానీ చంద్రబాబు గురించి కూడా మాట్లాడనని తెలిపారు. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లను వైసీపీ నేత పోసాని .. అసభ్యకరంగా దూషించారన్న అభియోగాలపై ఇప్పటికే ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇదే కాకుండా ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలోనూ పోసానిపై అనేక కేసులు నమోదయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడిని ఏకవచనంతో సంబోధించడమే కాకుండా.. తిరుమల కొండపై దోపిడీ చేయడానికి వచ్చారంటూ పోసాని చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులో పోసానిపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో తాజాగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పడం గమనార్హం.