విశాఖపట్నం: విశాఖపట్నంలోని పెద గదిలి కూడలి సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు తన తల్లిదండ్రులతో కలిసి భూమిపూజ చేశారు. ఇక్కడ సుమారు మూడెకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు కేటాయించింది.
అనంతరం పీవీ సింధు మాట్లాడుతూ..పనులు త్వరగా చేపట్టి ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అకాడమీ సామర్థ్యం, శిక్షణ తదితర వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. బ్యాడ్మింటన్‌పై ఆసక్తి ఉన్న చిన్నారులు, యువతను ఉన్నత స్థాయి పోటీల్లో ప్రతిభ చూపేలా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పీవీ సింధు అన్నారు. తనకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయని, అకాడమీ నిర్మాణానికి అన్ని అనుమతులు వచ్చాయని తెలిపారు. వైజాగ్‌లో బ్యాడ్మింటన్ నేర్చుకునే క్రీడాకారుల పొటెన్షియాలిటీ చాలా ఎక్కువని ప్రశంసించారు. ప్రభుత్వ సహకారంతో బ్యాడ్మింటన్‌పై ఆసక్తి ఉన్న యువతీ, యువకులకు అద్భుతమైన శిక్షణ ఇస్తామని సింధు తెలిపారు. తద్వారా మెరికల్లాంటి ఆటగాళ్లను తయారు చేసి, అంతర్జాతీయ వేదికలపై మెడల్స్ గెలిచేలా తయారు చేస్తామని అన్నారు.