అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు సర్పంచ్ సంఘాలతో అమరావతిలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని, కానీ గత ప్రభుత్వం వారిని మోసం చేసిందన్నారు.
వాలంటీర్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చని, కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదో సాంకేతిక సమస్య అని పవన్ చెప్పుకొచ్చారు. దీంతో వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించకుండా ప్రభుత్వం ఎందుకు పక్కనబెట్టేస్తోందో అన్న చర్చకు పవన్ స్పష్టమైన సమాధానం ఇచ్చినట్లయింది. అంతే కాదు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంపైనా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. దీనిపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుందో చూడాల్సి ఉంది.
మరోవైపు ఏపీలో గత వైస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్దను కొనసాగిస్తామని ఎన్నికల్లో చెప్పిన కూటమి నేతలు.. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మాత్రం వారిని పట్టించుకోవడం లేదు. వాలంటీర్ల సేవల్ని తీసుకోకుండా పక్కనబెట్టిన కూటమి సర్కార్.. వారికి జీతాలు కూడా చెల్లించడం లేదు. దీనిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సర్పంచ్ ల సంఘాలతో భేటీ అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీని వెనుక ఉన్న అసలు కారణం చెప్పారు.