న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా భేటి అయ్యారు. ఈ సమావేశంలో జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ఇచ్చే అంశంపై చర్చ జరిగింది. ఢిల్లీలో ఈ అరగంట పాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. కొత్త ప్రభుత్వం కోసం కేంద్రం పూర్తి మద్దతు ఇస్తామని అమిత్‌షా పేర్కొన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి కేంద్రం సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
గతంలో, 2019లో కేంద్ర ప్రభుత్వం 370వ ఆర్టికల్‌ను రద్దు చేయడం ద్వారా జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను తీసివేసింది, దీంతో జమ్మూకశ్మీర్ మరియు లడఖ్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారాయి. అయితే, ఈ నిర్ణయం తరువాత ఐదేళ్ల అనంతరం రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవడం ఖాయమైంది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో కూడా రాష్ట్ర హోదా పునరుద్ధరణకు సంబంధించిన ఒక తీర్మానం ఆమోదించబడింది. అబ్దుల్లా ఈ రోజు సాయంత్రం ప్రధని మోడీని కలుసుకుని ఆ తీర్మానం కాపీని సమర్పించే అవకాశం ఉంది.
ఇకపోతే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ 90 స్థానాలలో 42 స్థానాలను కైవసం చేసుకుని విజయం సాధించింది, దీంతో ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.