గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, నాలాల కబ్జాను ఆరికట్టేందుకు హైడ్రాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హైడ్రా అధికారులు నగరంలోని వందల కొద్దీ అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లు ఆక్రమించి నిర్మించిన పెద్ద పెద్ద బిల్డింగ్‌లు, విల్లాలను బుల్డోజర్లతో కూల్చేశారు. నగరంలో ఇప్పుడు హైడ్రా పేరు చెబితేనే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇక హైడ్రాకు ప్రభుత్వం పూర్తి స్థాయి స్వేచ్ఛనివ్వటంతో పాటుగా ప్రత్యేక అధికారులను కట్టబెడుతూ ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది.
కాగా చట్టపరమైన అనుమతులున్న వెంచర్లు, భవనాల విషయంలో ఎలాంటి భయం అవసరం లేదని హైడ్రా పేర్కొంది. చెరువుల వద్ద అనుమతులున్న నిర్మాణాలను కూల్చివేస్తారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. అన్ని పర్మిషన్లు ఉన్న నిర్మాణాలను కూల్చివేయబోమన్న సీఎం ఆదేశాలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది.