ఏపీ ప్రభుత్వం తెలుగు చిత్రపరిశ్రమకు ముఖ్యమైన సింగిల్ విండో సిస్టంను విశాఖపట్నంలో ప్రవేశపెట్టనుంది. ఈ ప్రక్రియ ద్వారా చిత్రీకరణ అనుమతులు సులభతరం అవుతాయి, తద్వారా చిత్రపరిశ్రమకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. ఈ విషయాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశాఖలో సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన టూరిజం అండ్ ట్రావెల్స్ సమ్మిట్‌లో ప్రకటించారు.
ఆయన మాట్లాడుతూ, పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి, భవిష్యత్తులో 3-4 రోజులు భక్తులు, సందర్శకులు ఆ ప్రాంతాల్లో గడపడానికి ఆ ప్రాంతాలను సమర్థవంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. 2025-30 కాలానికి ఒక సుస్థిరమైన టూరిజం పాలసీని రూపొందిస్తామని వెల్లడించారు. ఇటీవలే ఏపీలో సినిమాలు ఎక్కువగా చిత్రీకరణ అవుతున్నాయని, సినిమా పరిశ్రమ ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.