ముఖేశ్ అంబానీ..పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి. భారతదేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు.. పారిశ్రామికవేత్తలలో ఒకరు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Reliance Industries Ltd) ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ వేలాది కోట్లను వెనకేసుకుంటున్నాడు. ఈ సంస్థ పెట్రోకెమికల్స్, రిఫైనింగ్, టెలికమ్యూనికేషన్స్, రిటైల్ వంటి అనేక రంగాలలో వ్యాపారాలు చేస్తోంది. ముఖేశ్ అంబానీ ఆధ్వర్యంలో రిలయన్స్ సంస్థ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రాచుర్యం పొందింది. లక్షల కోట్ల ఆస్తులు కలిగివున్న అంబానీ ఇంట్లో పని వారికి కూడా భారీగానే జీతం ఉంటుందనే సంగతి చెప్పాల్సిన పనిలేదు. అంబానీ దగ్గర డ్రైవర్ జాబ్ చేసే వ్యక్తి జీతం నెలకు అక్షరాల రూ. 2 లక్షలు. ఇది ఏడేళ్ల కిందటి మాట.
2017 నాటి లెక్కల ప్రకారం, అంటే ఏడేళ్ల కిందట నెలకు రూ.2 లక్షలు. అంటే ఏడాదికి రూ.24 లక్షలు వేతనంగా చెల్లించారు. అదే ఇప్పుడు సుమారు ఇంతకు రెండింతల వరకు ఉంటుందని జాతీయ మీడియా పేర్కొంటోంది. అంటే సుమారు నెలకు రూ.4 లక్షల వరకు, ఏడాది మొత్తంగా చూస్తే 48 లక్షల వరకు జీతం అందుతుందన్న మాట. చాలా మంది ప్రముఖుల ఇళ్లల్లో పనిచేస్తున్న డ్రైవర్ల జీతాలు భారీగా ఉంటాయి. ఎందుకంటే వారు ప్రొఫెషనల్ డ్రైవర్లుగా సర్టిఫికెట్ కలిగి ఉంటారు. వారంతా ఎంతో కఠినమైన శిక్షణ పొంది ఉంటారు. ప్రయాణీకులకు అత్యంత భద్రత కల్పిస్తారు. లగ్జరీ, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను నడపడమే కాకుండా, వాటి టెక్నాలజీ, మెయింటెనెన్స్ ల పై పూర్తి అవగాహన కలిగి ఉంటారు. సాధారణంగా ఇలాంటి ప్రొఫెషనల్ డ్రైవర్లను ప్రైవేట్ కాంట్రాక్ట్ ఏజెన్సీల ద్వారా నియమించుకుంటారు. ఆ ఏజెన్సీలే వారికి శిక్షణ కూడా ఇస్తాయి. మరి అంత శిక్షణ తీసుకున్న వారు నెలకు వేలల్లో జీతం తీసుకోరు కదా..!!