రాష్ట్రంలో మందుబాబులకు సర్కార్ గుడ్ న్యూస్ తీసుకవచ్చింది. దసరా పండుగకు ముందే ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ప్రభుత్వం మద్యం పాలసీ ద్వారా భారీ ఎత్తున దోపిడీకి పాల్పడిందని ఆరోపించిన మంత్రి.. ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేటు వైస్ షాప్స్ నిర్వహణ జరిగేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీని ప్రభుత్వం ఖరారు చేసింది.
ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకూ ఈ విధానం అమల్లో ఉండనుంది. మొత్తం 3,396 మద్యం షాపుల లైసెన్స్ ల జారీకి సోమవారం అర్ధరాత్రి తర్వాత ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మంగళవారం (అక్టోబర్ 1,ఈరోజు) నుంచే దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మద్యం షాపులు నిర్వహించాలనుకునే వారు అన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ధరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు. అయితే ఒక్కో దరఖాస్తునకు రూ.2 లక్షల చొప్పున నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 11న జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ తీసి, లైసెన్సులు కేటాయించనున్నారు. ఈ నెల 12వ తేదీ నుండి లైసెన్సుదారులు కొత్త షాపులను ప్రారంభించి అమ్మకాలు చేపడతారని తెలిపారు.