Dasara festival:దసరా అంటే కేవలం పండుగ సంబరాలు, రావణ దహనం మాత్రమే కాదు.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ధర్మం, న్యాయం, సత్యం, మానవత్వం వంటి విలువలను గుర్తుచేసే పర్వదినం. ప్రతి ఏడాది దసరా వస్తుంది. రావణుడి బొమ్మ దహనం అవుతుంది. పండుగ ముగుస్తుంది. కానీ మనలోని స్వార్థం, ద్వేషం, అహంకారం, అసహనం అలాగే మిగిలిపోతే.. దసరా అసలు సందేశం నెరవేరినట్టేనా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరి ముందుంది. రావణుడిని దహనం చేయడం ఒక ఆచారం మాత్రమే. మనలోని రావణత్వాన్ని దహనం చేయడం అసలైన దసరా. హిందువుల్లోని ప్రతి పండుగకు ఒక సందేశం ఉంటుంది. అది కూడా సామాజికమైనదిగా ఉంటుంది. చెడుపై మంచి సాధించే విజయాలనే వివిధ రూపాల్లో పండుగలుగా చేసుకుంటాం. ఇందులో భాగమే విజయదశమి. నవరాత్రులు వివిధ అవతారాల్లో దర్శనమిచ్చే దుర్గామాత వేర్వేరు సందేశాలను ఇస్తుంది. ఆకారాలు. అవతరాలు మాత్రమే కాదు వాటి వెనుక ఉన్న కథలను, నిగూడ అర్థాలను అన్వేషించి ఆచరించినప్పడే పూర్తిస్థాయిలో దసరా పండుగ చేసుకున్నట్లు గుర్తించాల్సి ఉంటుంది. ఏది చేసినా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడితేనే మనం కూడా అభివృద్ధి చెందుతాం. అయితే ప్రస్తుతం సమాజంలో అనేక వింతపోకడలు చోటుచేసుకుంటున్నాయి. నేటి సమాజ పరిస్థితులను పరిశీలిస్తే రావణుడి పది తలల స్థానంలో మనిషిలో పెరుగుతున్న అసూయ, స్వార్థం, కోపం, అహంకారం, అత్యాశ, అవినీతి, మోసం, హింస వంటి అనేక సామాజిక దుర్గుణాలు కనిపిస్తున్నాయి. కాలం మారింది.
Dasara festival:రావణుడి పది తలలు: మనిషిలోని చెడు లక్షణాలు
సాంకేతికత అభివృద్ధి చెందింది.. జీవన ప్రమాణాలు పెరిగాయి. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, కృత్రిమ మేధస్సు, ఆధునిక వైద్యం, వేగవంతమైన రవాణా వంటి సౌకర్యాలతో మనిషి ఎన్నో రంగాల్లో ముందుకు సాగుతున్నాడు. నేలవిడిచి సాములెన్నో చేస్తున్నాడు. అంతరిక్షంలో దూసుకువెళుతున్నాడు. ఆధునిక సాంకేతిక రంగాలను అవపోషణ చేసి విజయపథంలో ముందుకు సాగుతున్నాడు. కానీ తన చుట్టూ జరిగే సామాజిక అంశాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. పోటీ ప్రపంచంలో మునిగితేలుతూ వాస్తవికతను మరిచిపోతున్నాడు. ఇలాంటి జీవనవిధానం వల్ల మానవ సంబంధాల్లో దూరం పెరుగుతోంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలహీనపడుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే గొడవలు, కోపాలు, విభేదాలు పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, వ్యక్తిగత దూషణలు, ద్వేషపూరిత వ్యాఖ్యలు సామాజిక వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మనకు తెలియకుండానే మనకు మనమే శత్రువులుగా మారుతున్నాం. మనల్ని నమ్ముకున్న వారిని దూరం చేసుకుంటున్నాం. ఈ విధానంలో మార్పు రావాలి. దసరా మనకు చెబుతున్న అసలు సందేశం ఇదే. చెడును కేవలం ఒక బొమ్మ రూపంలో దహనం చేయడం కాదు. మన ఆలోచనలు, ప్రవర్తనలో ఉన్న చెడును కూడా తొలగించాలి.
చెడుపై మంచి విజయం
మహిళలను గౌరవించడం, పిల్లలకు భద్రత కల్పించడం, వృద్ధులను ఆదరించడం, బలహీన వర్గాలకు అండగా నిలవడం, ఇతరుల హక్కులను గౌరవించడం వంటి విలువలు సమాజంలో మరింత బలపడాల్సిన అవసరం ఉంది. పండుగ రోజున దేవతలను పూజించడం ఎంత ముఖ్యమో మహిళల పట్ల ప్రతిరోజూ గౌరవం చూపడం కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని సమాజంలోని ప్రతిఒక్కరూ గుర్తించాలి. మహిళలపై అకృత్యాలు, అత్యాచారాలు పెరుగుతున్నాయి. హిందూమతంలో మహిళను దేవతగా పూజించే గొప్ప సంప్రదాయం ఉంది. మరోపక్క అవినీతి, అక్రమాలు, మోసాలు, అధికార దుర్వినియోగం వంటి సమస్యలు సమాజ ప్రగతికి అడ్డంకులుగా మారుతున్నాయి. అదే సమయంలో సాధారణ జీవితంలో కూడా నాకు మాత్రమే ప్రయోజనం కలగాని అనే స్వార్ధపు ఆలోచన పెరగడం సామాజిక సంబంధాలను బలహీనపరుస్తోంది. ఇతరుల కష్టాన్ని అర్ధం చేసుకోవడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించడం వంటి విలువలు మరింత పెరగాల్సిన అవసరం ఉంది. యువతకు దసరా మరో ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది. నిజమైన విజయం అంటే ఇతరులను ఓడించడం కాదు. మనలోని చెడు అలవాట్లను ఓడించడం. కోపాన్ని నియంత్రించడం, తప్పుడు సమాచారాన్ని నమ్మకపోవడం, సోషల్ మీడియాను బాధ్యతగా ఉపయోగించడం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించడం వంటి లక్షణాలు పెంపొందితేనే పండుగ సందేశం సార్థకమవుతుంది. కుటుంబంలో ప్రేమ, సమాజంలో పరస్పర గౌరవం, ప్రజా జీవితంలో నిజాయితీ, బలహీనుల పట్ల బాధ్యత పెరిగినప్పుడే దసరా పండుగకు నిజమైన అర్థం లభిస్తుంది. చెడుపై మంచి విజయం ఒక్కరోజు జరిగే కార్యక్రమం కాదు.. అది ప్రతిరోజూ మన ఆలోచనలు, మాటలు, చేతల్లో జరిగే ప్రక్రియ. అదే దసరా మనకు అందించే అసలైనసామాజిక సందేశం.
- డాక్టర్ గిరీష్ కుమార్ సంఘీ
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: