ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గీకరణకు సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ ఆర్డినెన్స్ ద్వారా జిల్లాలవారీగా జనాభా నిష్పత్తి ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తారు. వేట నిషేధకాలంలో మత్స్యకారులకు ఇచ్చే సాయం 20 వేలకు పెంచింది ప్రభుత్వం. ఏప్రిల్ 26న ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.దీంతో పాటు రాజధాని అమరావతిలో కీలక నిర్మాణాలకు నిధులు, ఐటీ అభివృద్ధికి భూ కేటాయింపులు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై కూడా మంత్రిమండలి నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు మంత్రులు డోలా బాలవీరాంజనేయస్వామి, నిమ్మల రామానాయుడు, అనిత మీడియాకు వివరాలు తెలిపారు.
ప్రెస్‌మీట్
ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను మంత్రులు సమర్ధవంతంగా ఎదుర్కొలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. మతపరమైన అంశాల్లో ప్రతిపక్షం ప్రజలను రెచ్చగొడుతోందన్న ముఖ్యమంత్రి.. వాటిని మంత్రులు ఎందుకు తిప్పకొట్టడం లేదని ప్రశ్నించారు. వాస్తవాలను ప్రజలకు ఎప్పటికప్పడు వివరించాలని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల ప్రభావం మంత్రులపై వెంటనే పనిచేసినట్టు కనిపిస్తోంది. మంత్రిమండలి సమావేశం ముగిసిన వెంటనే ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసిన నలుగురు మంత్రులు కేబినెట్ నిర్ణయాలతో వైసీపీ చేసిన పలు ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు.టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నేత భూమనపై కేసు పెడతామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. అబద్ధాన్ని నిజం చేయడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, రాష్ట్రంలో మతకలహాలకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొడతామని స్పష్టం చేశారు.

క్లస్టర్స్
రాష్ట్రంలో ఐటీ రంగాన్ని బలోపేతం చేసే దిశగా విశాఖపట్నంలో ఐటీ హిల్-3 వద్ద ప్రముఖ సంస్థ టీసీఎస్‌కు 21.66 ఎకరాలు, క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 3.5 ఎకరాలు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే కాపులుప్పాడలోక్లస్టర్స్‌కు మరో 56 ఎకరాలు కేటాయించారు.సంక్షేమ పథకాల అమలుపైనా కేబినెట్ దృష్టి సారించింది. ఈ నెల 26న మత్స్యకార భరోసా పథకం కింద అర్హులైన మత్స్యకారులకు రూ. 20,000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు హోంమంత్రి అనిత తెలిపారు.వీటితో పాటు, బలిమెల, జోలాపుట్ రిజర్వాయర్లపై 30 మెగావాట్ల సామర్థ్యంతో రెండు హైడల్ ప్రాజెక్టుల నిర్మాణానికి, పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి, వచ్చే విద్యా సంవత్సరంలోగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
Read Also: IMD: ఈ సారి సాధారణం కంటే అధిక వర్షపాతం : ఐఎండీ