అమృత్ టెండర్ల పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

KTR key comments on Amrit tenders

న్యూఢిల్లీ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఈరోజు అమృత్ పథకంలో జరిగిన అవకతవకలపై మీడియాతో మాట్లాడుతూ.. కొందరు బడాబాబులకు కేంద్ర ప్రభుత్వం దాసోహమైందంటూ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పిస్తున్నారని.. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుతోందని ఎద్దేవా చేశారు.

అమృత్ టెండర్లలో ప్రభుత్వ అవినీతి స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. మొత్తం 8 ప్యాకేజీలుగా అమృత్ పథకానికి టెండర్లను పిలిచారని.. ఎలాంటి అర్హత లేకపోయినా శోదా కంపెనీ కి టెండర్లను కట్టబెట్టారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, తన బావమరిది సృజన్‌రెడ్డి కి టెండర్లను అప్పగించారని ఆరోపించారు. మొత్తం రూ.8,888 వేల కోట్ల టెండర్లపై సమగ్ర విచారణ జరిపించి రద్దు చేయాలని తాము ఇప్పటికే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కోరామని గుర్తు చేశారు.

తెలంగాణలో ఆర్‌ఆర్‌ టాక్స్‌ (రేవంత్, రాహుల్ ట్యాక్స్) రాజ్యం నడుస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు టెండర్ల వివరాలను ఆన్‌లైన్‌లో కూడా పెట్టలేదని తెలిపారు. బావమరిదికి అమృతం పంచి అప్పనంగా రూ.1,137 కోట్ల టెండర్లు కట్టబెట్టారని కేటీఆర్ ధ్వజమెత్తారు. రూ.2 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ రూ.800 కోట్ల టెండర్లు ఎలా చేస్తుందని అన్నారు. కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్‌లను అప్పగిస్తే.. అధికార దుర్వినియోగం కిందకు రాదా అని ఆక్షేపించారు.

మనీ లాండరింగ్‌కు పాల్పడిన సోనియా, చౌహాన్ సహా చాలామంది పదవులు కోల్పోయారని.. త్వరలోనే రేవంత్ రెడ్డి , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పదవులు కూడా పోవడం ఖాయమని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ కి తెలంగాణ ఏటీఎంలా మారిందని అన్నారని గుర్తు చేశారు. నేడు కేంద్ర ప్రభుత్వ పథకంలో ఇంత పెద్ద స్థాయిలో అవినీతి జరుగుతున్నా.. ప్రధాని ఏం చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *