దేశంలో ప్రతీ ఏడాది ఆరంభమయ్యే నైరుతి రుతుపవనాలు (Southwest Winds) ఈసారి మే నెలాఖరుకే ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాలు నేడు కేరళ తీరం తాకనున్నాయి. ఇది సాధారణ సమయానికి దగ్గరగా ఉండటంతో వ్యవసాయ రంగం సహా అనేక రంగాల్లో సానుకూలత కనిపించే అవకాశముంది. రుతుపవనాల రాకతో కేరళలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మూడు రాష్ట్రాలకు నైరుతి పవనాలు
కేరళతో పాటు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ నైరుతి పవనాలు ప్రవేశించే అవకాశమున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా నైరుతి పవనాలు దక్షిణాది రాష్ట్రాల మీదుగా ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ, మరింతగా దేశం మొత్తం మీద విస్తరించతాయి. ఈ ప్రక్రియ వచ్చే రెండు మూడు రోజుల్లోనే జరిగే అవకాశం ఉందని IMD పేర్కొంది. దీంతో దక్షిణ భారతదేశం వర్షాల తాకిడికి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది.
జూన్ రెండో వారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో
నైరుతి పవనాల ప్రభావంతో జూన్ రెండో వారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు పంట సాగుకు అనుకూలంగా మారనున్నాయి. వ్యవసాయ కార్యకలాపాలు మొదలుపెట్టే సమయంగా భావిస్తున్న రైతులకు ఇది మంచి పరిణామం. వాతావరణ శాఖ సూచనలను గమనిస్తూ రైతులు తమ కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.