టెలిఫోన్ (Telephone) మోగగానే ప్రతీ ఒక్కరు పలికే మొదటి మాట “హలో”. ఇది ఇప్పుడు సాధారణ అలవాటుగా మారిపోయింది. అయితే ఈ పదం ఎలా వచ్చిందో, ఎందుకు టెలిఫోన్ సంభాషణల ప్రారంభంలో వాడుతారో చాలా మందికి తెలియదు. ఈ పదం నిజానికి టెలిఫోన్ ఆవిష్కరణ కంటే ముందే భాషలో వాడుకలోకి వచ్చింది. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం “హలో” అనే పదం “holla” లేదా “hollo” అనే ప్రాచీన పదాల నుంచి ఉద్భవించింది. ఈ పదాలు అప్పట్లో దూరంగా ఉన్నవారిని గమనింపజేసేందుకు, దృష్టి ఆకర్షించేందుకు వాడేవారు.
టెలిఫోన్ డైరెక్టరీలు హలో అంటూ మొదలుపెట్టారు
టెలిఫోన్ ఆవిష్కరణ అయిన తర్వాత, సంభాషణ ప్రారంభంలో ఏమని పలకాలో స్పష్టత లేకపోయింది. అప్పట్లో కొన్ని టెలిఫోన్ డైరెక్టరీలు, సంభాషణ “హలో” అంటూ మొదలుపెట్టాలని సూచించాయి. అలెగ్జాండర్ గ్రాహమ్ బెల్ మొదట “Ahoy” అనే పదాన్ని వాడాలని సూచించినా, “హలో” అనే పదం ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. ఎందుకంటే అది సులభంగా పలికే పదం కావడం, వినటానికి స్నేహపూర్వకంగా ఉండటం ఇందుకు కారణంగా భావించవచ్చు.
ప్రస్తుతం ట్రెండ్ “వాట్సప్ బ్రో”
కాలక్రమంలో “హలో” అనే పదం ప్రపంచవ్యాప్తంగా టెలిఫోన్ సంభాషణలకు ఒక ఆదర్శ ప్రారంభ వాక్యంగా స్థిరపడిపోయింది. అయితే ఆధునిక కాలంలో ఈ పదానికి ప్రాధాన్యత తగ్గుతోంది. సోషల్ మీడియా, మెసేజ్ యాప్స్ లలో “వాట్సప్ బ్రో”, “హాయ్”, “హేయ్” వంటి పదాలు ట్రెండ్ అయ్యాయి. అయినా కూడా “హలో” అనే పదం ఫోన్ సంభాషణల్లో ఇప్పటికీ తన ప్రత్యేకతను నిలుపుకుంటూనే ఉంది.
Read Also : Miss World 2025 : చీరకట్టులో ప్రపంచ సుందరీమణుల సందడి!