ఏపీ రాజధాని అమరావతిలో దేశంలోనే మొదటి క్వాంటం వ్యాలీ టెక్ పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అమరావతి క్వాంటం వ్యాలీ కోసం ఐబీఎం, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఇటీవలే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఐబీఎం, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు,రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. 2026 జనవరి ఒకటి నుంచి అమరావతి కేంద్రంగా క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు(CM Chandrababu) కూడా ప్రకటించారు. అనంతరం అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటు కోసం ప్రభుత్వం భూమిని కూడా కేటాయించాలని నిర్ణయించింది. క్వాంటం వ్యాలీ ఏర్పాటు కోసం 50 ఎకరాలు కేటాయించాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది.అమరావతి క్వాంటం వ్యాలీ టెక్ పార్కును ఉద్ధండరాయునిపాలెం, లింగాయపాలెం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనునట్లు తెలుస్తోంది. ఈ గ్రామాల పరిధిలో 50 ఎకరాల్లో క్వాంటం వ్యాలీ టెక్ పార్కును ఏర్పాటు చేసే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు, కరకట్ట రోడ్డు మధ్య భాగంలో 50 ఎకరాల్లో క్వాంటం వ్యాలీ టెక్ పార్కు(Quantum Valley Tech Park)ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటైతే,దేశంలోనే తొలి అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్కు అవుతుంది.

నిర్ణయం
మరోవైపు అమరావతిలో వివిధ సంస్థలకు ఏపీ ప్రభుత్వం ఇటీవల భూములు కేటాయించింది. ఈ క్రమంలోనే అమరావతిలో లా యూనివర్సిటీ, క్వాంటం వ్యాలీ ఏర్పాటు కోసం 50 ఎకరాలు చొప్పున కేటాయించారు. అలాగే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఇప్పటికే కేటాయించిన 15 ఎకరాలకు అదనంగా మరో 6 ఎకరాలు కేటాయించింది. అమరావతిలో బసవతారకం ఆస్పత్రికి ఇప్పటికే 15 ఎకరాలు కేటాయించారు. తాజాగా బసవతారకం మెడికల్ కాలేజీకి 6 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఐఆర్‌సీటీసీ కోసం ఎకరా భూమిని, ఆదాయపు పన్ను శాఖకు 0.78 ఎకరాలు, రెడ్‌క్రాస్ సొసైటీకి 0.78 ఎకరాలు, కోస్టల్ బ్యాంక్ కోసం 0.40 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుంది.
Read Also :Kanipakam Temple : కాణిపాకం వీఐపీ దర్శనం టికెట్ ధర పెంపు