కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడితో ఒక్కసారిగా భారత్ ఉలిక్కిపడింది. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారానికి వచ్చినవారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి తామే పాల్పడినట్టు ఉగ్రసంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది.2019లో పుల్వామా దాడి తర్వాత జమ్మూ లోయలో జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇది.
ఆరు కల్మాలు
ముష్కర మూకలు మతం అడిగి మరీ పర్యాటకుల ప్రాణాలు తీసినట్టు బాధితులు వెల్లడించారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు ‘మీరు ముస్లింలా? అయితే కల్మా చెప్పండి’ అని అడిగి వారు ముస్లింలు అవునా? కాదా నిర్ధారించుకునే ప్రయత్నం చేశారు. వారు అడిగినట్టు కల్మా (కలిమా లేదా షహాదా) అంటే ఏంటి? ఇస్లాంలో దానికి ప్రాముఖ్యత ఎందుకు? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే, 2014లో కెన్యాలో ఓ బస్సుపై జరిగిన దాడిలోనూ అల్-షబాబ్ ఉగ్రవాదులు ఇదే తరహా పద్ధతిని అనుసరించారు. అక్కడ కూడా కలిమా చెప్పలేని వారిని ముస్లింలు కాదని గుర్తించి, హత్య చేశారు. ఇలాంటి దృశ్యాలు సినిమాల్లో కూడా చూస్తుంటాం.కల్మా లేదా షహాదా అనేది ముస్లింల విశ్వాసానికి మౌలిక శిల. ఇది అల్లాహ్ ఏకత్వాన్ని, ముహమ్మద్ ప్రవక్త ప్రవక్తత్వాన్ని నమ్మే ప్రకటన. ఇస్లాంలో మొత్తం ఆరు కల్మాలు ఉంటాయి. వాటిలో ప్రతీదీ ప్రత్యేక ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది.
మొదటి కల్మా: కల్మా తయ్యిబ్– స్వచ్ఛత
అర్థం: ‘అల్లాహ్ తప్ప ఏ దేవుడు లేడు, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వామిలేరు, ముహమ్మద్ ప్రవక్త ఆయన దూత.
రెండో కల్మా: కల్మా షహాదా – సాక్ష్యం
అర్థం: “నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప ఇంకా దేవుడు లేడు, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వామిలేరు. ముహమ్మద్ ప్రవక్త ఆయన సేవకుడు, దూత.
మూడో కల్మా: కల్మా తంఝీద్ – మహిమచేతన
అర్థం: (అల్లాహ్ పవిత్రుడు, అల్లాహ్‌కు స్తుతి, అల్లాహ్ తప్ప ఏ దేవుడులేడు, అల్లాహ్ గొప్పవాడు. శక్తి, బలం అల్లాహ్‌తో తప్ప మరెవ్వరితోనూ లేదు.
నాలుగో కల్మా: కల్మా తౌహీద్ – ఏకత్వం
అర్థం: అల్లాహ్ తప్ప మరెవరూ పూజార్హుడు కాదు. ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వామిలేరు. రాజ్యం ఆయనదే, స్తుతి ఆయనదే. ఆయన ప్రాణం ఇస్తాడు, తీసుకుంటాడు. ఆయనకు ఎప్పటికీ మరణం ఉండదు, ఆయన కరుణాశీలుడూ మహిమాన్వితుడూ. ఆయన చేతిలోనే అన్నీ ఉన్నాయి. ఆయనకు అన్నింటిపై అధికారం ఉంది.

ఐదో కల్మా: కల్మా అస్తఘ్ఫార్ – పశ్చాత్తాపం
అర్థం: ప్రభువా! నేను తెలిసీ తెలియక చేసిన, రహస్యంగా లేదా బహిరంగంగా చేసిన అన్ని పాపాలను మన్నించు. నాకు తెలిసిన పాపాలు గానీ తెలియనివి గానీ మన్నించు. నీవు రహస్యాలుగానూ పాపాలుగానూ కప్పిపుచ్చేవాడవు, క్షమించేవాడవు. బలం, శక్తి నీదే.
ఆరో కల్మా: కల్మా రద్దే కుఫ్ర్ – అవిశ్వాసాన్ని తిరస్కరించడం
అర్థం: నేను అల్లాహ్ ఒక్కడేనని, ఆయనకు భాగస్వామిలేరని నమ్ముతున్నాను, నేను బహు దేవారాధన, కుఫ్ర్, అసత్య విశ్వాసాలను తిరస్కరిస్తున్నాను. నీవే ఒకే నిజమైన దేవుడు, నీవే నా దైవం.ఇస్లాంలో కల్మాలకు చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే అవి ముస్లిం విశ్వాసాల మౌలిక సూత్రాలను సారాంశంగా తెలియజేస్తాయి. ఆరు కల్మాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల ప్రాథమిక విశ్వాసాలు. ముస్లింలు ఈ కల్మాలను అనుసరిస్తూ వాటిలో ఉన్న మూలసిద్ధాంతాలను తమ జీవనశైలికి అన్వయించుకుంటారు.ఈ కల్మాలు అల్లాహ్ ఏకత్వాన్ని, ప్రవక్త ముహమ్మద్ ప్రవక్తత్వాన్ని, అవిశ్వాసాన్ని తిరస్కరించడాన్ని స్పష్టంగా ప్రకటిస్తాయి. ఈ కల్మాలను జపించడం ద్వారా ముస్లింలు అల్లాహ్‌తో తమ బంధాన్ని బలోపేతం చేసుకుంటారు, అలాగే ఇస్లాం సిద్ధాంతాల పట్ల తమ కట్టుబాటును పునరుద్ఘాటిస్తారు.అంతేకాక, ఈ కల్మాలు పాపాలను మన్నించమని ప్రార్థనలు, కృతజ్ఞత భావన, బహుదేవాతారాధన నుంచి రక్షణ కోసం చేసిన ప్రార్థనలుగా కూడా పరిగణిస్తారు.
Read Also: Chaudhry Fawad Hussain : పహల్గామ్ ఉగ్రదాడి..పాకిస్థాన్ మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు