జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్(Pahalgam)లో చోటుచేసుకున్న ఉగ్రవాదుల దాడి అనంతరం భారత్- పాకిస్తాన్(India-Pak) మధ్య యుద్ధ వాతావరణం పతాక స్థాయికి చేరుకుంది. రెండు దేశాలు దాడులు ప్రతిదాడులకు దిగాయి. డ్రోన్లు, మిస్సైళ్లను సంధించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్(Trump) ట్రంప్ జోక్యం చేసుకోవడంతో కాల్పుల విరమణకు అంగీకరించాయి. భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోవడానికి తానే కారణం అని డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. యుద్ధాన్ని కొనసాగించితే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని తాను హెచ్చరించానని, దీనితో ఈ రెండు దేశాలు కూడా యుద్ధ విరమణ ప్రకటించాయని ఆయన చెప్పుకొన్నారు.

భారత్- పాక్ మధ్య యుద్ధాన్ని ఆపినందుకు గర్వపడుతున్నా
పదే పదే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తోన్నారు డొనాల్డ్ ట్రంప్. మొన్నటికి మొన్న సౌదీ అరేబియా పర్యటనలో ఇదే విషయాన్ని గుర్తు చేశారు. సందర్భంగా కాకపోయినా కూడా ప్రతిష్ఠాత్మక సౌదీ- యూఎస్ ఇన్వెస్టిమెంట్ ఫోరం సదస్సులో భారత్- పాకిస్తాన్ యుద్ధం గురించి మాట్లాడారు. తాజాగా మరోసారి ఈ అంశాన్ని లేవనెత్తారు. భారత్- పాక్ మధ్య యుద్ధాన్ని ఆపినందుకు గర్వపడుతున్నానని వ్యాఖ్యానించారు. ఆ రెండు దేశాలతో కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో మధ్యవర్తిత్వం వహించడం.. తనకు గర్వకారణమని పేర్కొన్నారు. భారత్- పాకిస్తాన్ ను సమంగా చూస్తోన్నామని, ఈ రెండు దేశాలతో సమానంగా వ్యవహరిస్తోన్నామని చెప్పారు. బుల్లెట్ల ద్వారా కాకుండా ట్రేడ్ అండ్ టారిఫ్ ద్వారా అణు యుద్ధాన్ని ఆపగలిగామని పేర్కొన్నారు డొనాల్డ్ ట్రంప్. సాధారణంగా ఏ రెండు దేశాలైనా బుల్లెట్ల ద్వారా యుద్ధంలో పాల్గొంటాయని, తాము ట్రేడ్- టారిఫ్ ద్వారా న్యూక్లియర్ యుద్ధాన్ని ఆపివేశామని అన్నారు. భారత్- పాక్ మధ్య అణు యుద్ధాన్ని నిలిపివేయడం తనకు గర్వకారణమని చెప్పుకొచ్చారు.
ప్రపంచంలోనే అమెరికాకు గొప్ప సైన్యం
ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉన్నా ఇది అణు విపత్తుగా మారే ప్రమాదం ఉందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు ట్రంప్. తన మాటకు విలువ ఇచ్చి యుద్ధాన్ని నిలిపివేసినందుకు భారత్- పాకిస్తాన్ లకు కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నారు. ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోవడం, అణ్వాయుధాలను ఉపయోగించే దేశాలతో వ్యాపారం చేయలేమని స్పష్టం చేశారు. ఈ రెండు దేశాల్లో గొప్ప నాయకులు ఉన్నారని, తన మాటల తీవ్రతను అర్థం చేసుకుని, కాల్పుల విరమణకు అంగీకరించారని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. యుద్ధ తీవ్రత కొనసాగుతున్న ఇతర దేశాలతో కూడా చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నామని రష్యా- ఉక్రెయిన్ యుద్ధం గురించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అమెరికాకు గొప్ప సైన్యం ఉందని పునరుద్ఘాటించారాయన.
Read Also: Donald Trump : చైనాపై మరోసారి డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు