అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటోన్న నిర్ణయాలు, జారీ చేస్తోన్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అమెరికా మేక్ గ్రేట్ అగైన్ కాన్సెప్ట్ కింద ప్రపంచ దేశాలపై ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్ వ్యవహారం.. అక్కడి వాళ్లకే రుచించట్లేదు. దీన్ని నిరసిస్తూ ఇప్పటికే రోడ్డెక్కారు అమెరికన్లు.
దుమారం రేపుతోన్న హార్వర్డ్ యూనివర్శిటీ వివాదం
అదే సమయంలో- మరో వివాదం తెర మీదికి వచ్చింది. ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్శిటీకి ఫండింగ్‌ను నిలిపివేయడం తాజాగా దుమారం రేపుతోంది. యూనివర్శిటీ కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తమౌతోంది. నిధులను నిలిపివేయడాన్ని యూనివర్శిటీ బోర్డు తప్పు పట్టింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. నిధులను నిలిపివేస్తూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేసింది. ఈ మేరకు బోస్టన్ ఫెడరల్ కోర్టులో సూట్ ఫైల్ చేసింది. యూనివర్శిటీ వ్యవహారాలను పరిమితం చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరిస్తామంటూ ఇటీవలే స్పష్టం చేసింది బోర్డ్. దీనికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలో దిగింది.

గ్రాంట్ల నిలిపివేతకు ట్రంప్ ఉత్తర్వులు
హార్వర్డ్ యూనివర్శిటీకి 2.3 బిలియన్లకు పైగా మంజూరు చేయాల్సిన గ్రాంట్ల తక్షణమే నిలిపివేయాలంటూ ఈ నెల 11వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు ట్రంప్. ఈ మేరకు హార్వర్డ్ యూనివర్శిటీకి లేఖ రాశారు. యూనివర్శిటీ బోర్డును సంస్కరించాల్సిన అవసరం ఉందని, అడ్మిషన్ల వ్యవస్థలతో మార్పులు చేయాలంటూ సూచించింది. యూనివర్శిటీ నిధుల వినియోగంపై సమగ్ర నివేదిక అందజేయాలని, ఆడిట్ సైతం చేయాలని ఆదేశించింది. విద్యార్థి క్లబ్‌లను అధికారికంగా గుర్తించడాన్ని కూడా నిలిపివేయాలని, వాటికి ఆర్థికంగా ఎలాంటి సహాయ సహకారాలను కూడా అందజేయకూడదని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ డిమాండ్ చేసింది.
నిధులను నిలిపివేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు
గత ఏడాది గాజాపై ఇజ్రాయెల్ యుద్ధానికి వ్యతిరేకంగా హార్వర్డ్ యూనివర్శిటీ క్యాంపస్ భారీగా నిరసనలు చెలరేగాయి. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు క్యాంపస్‌లో చోటు చేసుకున్నాయి. వాటన్నింటినీ కూడా ప్రభుత్వ వ్యతిరేక చర్యగా భావించింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. హార్వర్డ్ సహా వివిధ యూనివర్శిటీలు యూదుల పట్ల వ్యతిరేకతను పెచ్చరిల్లేలా చేశాయని అభిప్రాయపడుతోంది. దీన్ని కట్టడి చేయడానికి నిధుల్లో కోత పెట్టింది. 2.3 బిలియన్ డాలర్లను నిలిపివేసింది. దీన్ని యూనివర్శిటీ బోర్డు తప్పు పట్టింది. ప్రభుత్వం సూచించిన ఏ ఒక్క డిమాండ్‌కు కూడా తాము అంగీకరించబోమని హార్వర్డ్ యూనివర్శిటీ ఛైర్మన్ అలాన్ గార్బర్ తేల్చి చెప్పారు. ప్రపంచ దేశాల్లో అమెరికాను అగ్రస్థానంలో నిలపాలనే ఉద్దేశంతో అనేక పరిశోధనలను చేపట్టామని గార్బర్ తెలిపారు. మెడిసిన్, టెక్నాలజీ, స్పేస్ వంటి రంగాల్లో పరిశోధనల సాగిస్తోన్నామని, ప్రభుత్వం నిధులను నిలిపివేయడం వల్ల వాటి కార్యకలాపాలు స్తంభించిపోయతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ వ్యతిరేక ఆందోళనల్లో ఎలాంటి హేతుబద్ధత లేదని చెప్పారు.
Read Also: Shock for Trump : కోర్టుకెక్కిన హార్వర్డ్ యూనివర్సిటీ