అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లకు అడ్డు అదుపు ఉండట్లేదు. ఈ విషయంలో రోజుకో కొత్త ప్రకటన జారీ చేస్తోన్నారు. టారిఫ్‌ల యుద్ధానికి తెర తీశారు. వందకు పైగా దేశాలు అమెరికా టారిఫ్‌ల రాడార్‌లోకి వెళ్లిపోయాయి. భారత్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. కొత్తగా విధించిన అదనపు టారిఫ్ వల్ల ఇప్పటికే ఆటోమోటివ్ మొదలుకుని ఐటీ దాకా దాదాపుగా అన్ని రంగాలు కూడా తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. కొన్ని రకాల ఎగుమతులు సైతం స్తంభించిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఇతర దేశాలకు వాటిని ఎగమతి చేయాల్సి వస్తోంది.

కుదేలవుతున్న ఐటీ రంగం
అమెరికా రక్షణ శాఖకు సంబంధించిన టెక్ దిగ్గజ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేయడానికి సిద్ధపడ్డారు డొనాల్డ్ ట్రంప్. బిలియన్ల కొద్దీ డాలర్ల కాంట్రాక్ట్‌లు రద్దు కానున్నాయి. ఫలితంగా ఐటీ రంగం తీవ్ర కుదుపులకు లోనవుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. కాస్ట్- కటింగ్ చర్యలో భాగంగా డెలాయిట్, యాక్సెంచర్ వంటి సంస్థలతో గతంలో కుదుర్చుకున్న 5.1 బిలియన్ డాలర్ల విలువ చేసే కాంట్రాక్టులను రద్దు చేసినట్లు అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్‌సెత్ వెల్లడించారు. డెలాయిట్, యాక్సెంచర్, బూజ్ అలెన్, హామిల్టన్ వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ పరిస్థితుల మధ్య డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. సినిమా పరిశ్రమపై తాజాగా టారిఫ్‌ను ప్రకటించారు. నాన్ అమెరికన్ అంటే అమెరికా వెలుపల నిర్మితం అయ్యే అన్ని సినిమాల మీద 100 శాతం టారిఫ్‌ను విధించనున్నట్లు వెల్లడించారు. హాలీవుడ్‌ను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పూర్వ వైభవం
ఇతర దేశాలను ఆకర్షించడానికి అందిస్తోన్న ప్రోత్సాహకాల వల్ల అమెరికా చిత్ర పరిశ్రమ చాలా వేగంగా చనిపోతోందని (Very fast death) ట్రంప్ వ్యాఖ్యానించారు. నాన్ అమెరికన్ చిత్ర పరిశ్రమ మొత్తం తమ దేశంలో సినిమాలను విడుదల చేస్తూ సొమ్ము చేసుకుంటోండటం అటు జాతీయ భద్రతకూ ముప్పుగా పరిణమిస్తోందని పేర్కొన్నారు.
దీనికి సంబంధించిన సమాచారాన్ని తన వ్యక్తిగత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌పై ఓ పోస్ట్ చేశారు. విదేశాల్లో నిర్మించి.. అమెరికాలో ప్రదర్శించే అన్ని సినిమాలపైనా 100 శాతం టారిఫ్ విధించే ప్రక్రియను వెంటనే చేపట్టనున్నామని అన్నారు. ఈ మేరకు వాణిజ్యం సహా చిత్ర పరిశ్రమతో ముడిపడి ఉన్న అన్ని శాఖలకు అధికారం ఇస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పూర్వ వైభవం రావాలని కోరుకుంటోన్నామని అన్నారు. ట్రంప్ చేసిన ఈ పోస్ట్‌కు వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ తన అధికారిక ఎక్స్ అకౌంట్ సమాధానం ఇచ్చారు. నాన్ అమెరికన్ సినిమాలన్నింటిపైనా 100 శాతం టారిఫ్ విధించడంపై వర్కవుట్ చేస్తోన్నామని రిప్లై ఇచ్చారు. త్వరలోనే దీనిపై ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. హాలీవుడ్‌కు కేంద్ర బిందువు లాంస్ ఏంజిలిస్. దశాబ్దంలో లాస్ ఏంజిలిస్‌లో సినిమా, టీవీ టాక్‌షోలు, వెబ్ సిరీస్‌ల నిర్మాణం దాదాపుగా 40 శాతం మేర తగ్గిందని ఫిల్మ్‌ఎల్‌ఏ తెలిపింది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో కూడా లాస్ ఏంజిలిస్‌లో టీవీ కార్యక్రమాలు, సినిమా, అడ్వర్టయిజ్‌మెంట్ల నిర్మాణం భారీగా క్షీణించిందని వివరించింది.
22.4 శాతం మేర తగ్గుదల నమోదు
చిత్ర నిర్మాణ ఖర్చు తక్కువగా ఉండే కెనడా, బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా.. వంటి దేశాలకు పలు చిత్ర నిర్మాణ సంస్థలు తరలి వెళ్లడమే దీనికి కారణమని ఫిల్మ్ ఎల్ఏ తెలిపింది. 2024లో ఇదే కాలంతో పోలిస్తే ఆన్-లొకేషన్ ప్రొడక్షన్‌లో 22.4 శాతం మేర తగ్గుదల నమోదైంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని స్వదేశంలో చిత్ర నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలో హాలీవుడ్‌కు స్పెషల్ అంబాసిడర్లుగా జాన్ వోయిట్, సిల్వెస్టర్ స్టాలోన్, మెల్ గిబ్సన్‌ను అపాయింట్ చేశారు. పలు రాయితీలనూ ప్రకటించారు. ఇప్పడు తాజాగా నాన్ అమెరికన్ సినిమాలపై 100 శాతం టారిఫ్ ప్రకటించారు.