ప్రయాణికుల సౌకర్యాలే లక్ష్యంగా టీజీఎస్ఆర్టీసీ (TGRTC) అధికారులు మరింత సమర్థవంతంగా సేవలను అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ‘మహాలక్ష్మి పథకం’ కింద మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. జీరో టికెట్ ద్వారా వారు ఏ ప్రదేశం నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. దీంతో మహిళలు భారీగా TGRTC బస్సులను వినియోగించుకుంటున్నారు.ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి నడుపుతున్న ఆర్టీసీ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు ప్రయాణంలో మరింత సౌకర్యంగా ఉండేందుకు బస్సుల్లో వై-ఫై సదుపాయం కల్పించాలని నిర్ణయించింది.ఈ మేరకు ఢిల్లీకి చెందిన ఒక ప్రైవేట్ సంస్థ నుంచి ప్రతిపాదనలు అందాయి.మంగళవారం (జూన్ 17) సచివాలయంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ, రోడ్డు రవాణా అథారిటీ (RTA)పై సమీక్ష నిర్వహించారు.
ప్రయాణికులు ముందుగానే
ఈ సందర్భంగా సదరు ప్రైవేట్ సంస్థ ప్రతినిధులు మంత్రికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. బస్సులు, బస్టాండ్లు, రవాణాశాఖ కార్యాలయాల్లో వై-ఫై (WIFI) సదుపాయాన్ని అందిస్తామని చెప్పారు. ఈ ప్రతిపాదనలో ఇంటర్నెట్ యాక్సెస్‌తో కూడిన వై-ఫై కాకుండా, అప్‌లోడ్ చేసిన కంటెంట్‌ను వై-ఫై ద్వారా మొబైల్‌లలో చూసే అవకాశం కల్పించడం ప్రధానాంశం. అంటే ప్రయాణికులు ముందుగానే ఎంపిక చేసిన సినిమాలు, పాటల జాబితాను వీక్షించగలరు. ఈ కంటెంట్ మధ్యలో కమర్షియల్ యాడ్స్ కూడా వస్తాయి. ఈ ప్రకటనల ద్వారా ప్రైవేట్ సంస్థకు ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.ప్రస్తుతం లహరి ఏసీ బస్సుల్లో ఈ తరహా విధానం అమలవుతోంది.

స్పష్టత వచ్చే
అయితే మిగతా బస్సులు, బస్టాండ్లలో కూడా ఈ సదుపాయాన్ని విస్తరించాలని ఢిల్లీ సంస్థ ప్రతిపాదించింది. త్వరలో ఆ సంస్థ, ఆర్టీసీ అధికారుల (RTC officials) మధ్య మరో సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత వై-ఫై సదుపాయం కల్పనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే ప్రయాణికులు తమ ప్రయాణ సమయాన్ని మరింత ఆహ్లాదకరంగా గడపడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రతిపాదన ద్వారా ఆర్టీసీకి అదనపు ఆదాయ మార్గాలు కూడా లభించే అవకాశం ఉంది.
Read Also: School Fee : ‘వామ్మో.. నర్సరీకి రూ.50వేల ఫీజు’.. ఓ తండ్రి ఆవేదన