తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)-2025 మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి అయింది.అయితే, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పదో వంతు డిగ్రీ కళాశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 805 కళాశాలలు ఉండగా, వాటిలో 74 కాలేజీల్లో సున్నా అడ్మిషన్లు నమోదయ్యాయి. ఆశ్చర్యకరంగా, ఈ జాబితాలో రాజన్న-సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Yellareddypet Government Degree College) కూడా ఉండటం గమనార్హం.రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి, ఉపాధ్యక్షుడు ఈ. పురుషోత్తం, ఎస్‌కె. మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్ తదితరులు గురువారం దోస్త్ తొలి విడత అడ్మిషన్ల జాబితాను విడుదల చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి (2025-26) సంబంధించి ఈ నెల 3న దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలైంది. మొత్తం 89,572 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోగా, వారిలో 65,191 మంది వెబ్ ఆప్షన్లను సమర్పించారు. వీరిలో 60,436 మందికి సీట్లు లభించాయి. రాష్ట్రవ్యాప్తంగా 805 డిగ్రీ కళాశాలల్లో మొత్తం 3,71,096 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
మాధ్యమాల
గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కామర్స్ కోర్సుల వైపే విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపారు. మొత్తం సీట్లు పొందిన వారిలో 36 శాతం మంది (21,758) కామర్స్ కోర్సులను ఎంచుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ఫిజికల్ సైన్స్ (15,249 మంది), లైఫ్ సైన్స్ (11,005 మంది), ఆర్ట్స్ (5,986 మంది), ఇతర కోర్సులు (6,438 మంది) ఉన్నాయి. మాధ్యమాల వారీగా చూస్తే, 58,575 మంది ఇంగ్లిష్ మీడియం(English Medium)ను ఎంచుకోగా, 1,552 మంది తెలుగు మీడియం, 309 మంది హిందీ మీడియంను ఎంచుకున్నారు. మొదటి జాబితాలో అమ్మాయిలే ఎక్కువ సీట్లు దక్కించుకోవడం విశేషం.

అగ్రస్థానం
హైదరాబాద్‌లోని ప్రఖ్యాత నిజాం కాలేజీ సీట్ల భర్తీలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ కాలేజీలో అందుబాటులో ఉన్న 1,197 సీట్లకు గాను 1,170 సీట్లు (97.74%) భర్తీ అయ్యాయి. కోఠి మహిళా కళాశాల (వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం) 93.19 శాతంతో రెండో స్థానంలో, సిటీ కాలేజీ 88.89 శాతంతో మూడో స్థానంలో నిలిచాయి. బేగంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (82.69%), ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (80.98%), నారాయణగూడలోని బాబు జగ్జీవన్‌రాం డిగ్రీ కళాశాల (80.29%) కూడా ఉత్తమ పనితీరు కనబరిచాయి. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాల(SRR Government College)లో 73.01%, నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా కళాశాలలో 68.56%, హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో 66.1%, నిజామాబాద్‌లోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో 65.75% సీట్లు భర్తీ అయ్యాయి.ఈసారి దోస్త్‌లో టాప్ 10 ర్యాంకర్లలో నలుగురు కోఠి మహిళా కళాశాలను ఎంచుకోవడం విశేషం. వారిలో ముగ్గురు ఫిజికల్ సైన్సెస్, ఒకరు లైఫ్ సైన్స్ సబ్జెక్టును ఎంచుకున్నారు. ఇంటర్‌లో 99.60% మార్కులతో దోస్త్‌లో రాష్ట్ర ప్రథమ ర్యాంకు సాధించిన వసంత్ కుమార్, 99.40% మార్కులతో ఎనిమిదో ర్యాంకు పొందిన బెక్కరి అక్షిత కూడా నిజాం కాలేజీలో కామర్స్ విభాగంలో సీటు పొందారు.
Read Also: BRS: బీఆర్ఎస్ నేత ఆత్మహత్య