మావోయిస్టు జీవితాలకు ముగింపు పలుకుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అడవి ప్రాంతాల నుంచి ఒక్కసారిగా 86 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ‘ఆపరేషన్ చేయూత’ పేరిట మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో లొంగిపోయారు. నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు భారీ సంఖ్యలో సరెండర్లు జరిగాయని ఐజీ తెలిపారు.లొంగిపోయిన వారిలో 20 మంది మహిళా మావోయిస్టులు, 66 మంది పురుషులు ఉన్నారు. గత నాలుగు నెలల్లో జిల్లా వ్యాప్తంగా 66 మంది మావోయిస్టులను అరెస్టు చేయగా, తాజాగా 86 మంది లొంగిపోయారు. లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకంగా 25 వేల రూపాయల చెక్కును ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి అందజేశారు.కాలం చెల్లిన సిద్ధాంతాలను వదిలి జనజీవన స్రవంతిలో కలవాలనే పిలుపునకు తోడు, మావోయిస్టు అగ్ర నాయకుల వేధింపులు,తట్టుకోలేక లొంగిపోయినట్లు ఐజీ పి.చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. లొంగిపోయిన వారిలో ఏసీఎం నుంచి 4, పార్టీ నుంచి 4, మిగతా వారు రకరకాల సంఘాల మిలీషియా సభ్యులు ఉన్నారని తెలిపారు.కొత్తగూడెం జిల్లాకు చెందిన వారు 81 మంది కాగా ములుగు జిల్లాకు చెందిన వారు ఐదుగురు ఉన్నట్లు వెల్లడించారు.
పునరావాసం
ఏసీఎం సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు, పార్టీ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. లక్ష, మిగతా సభ్యులకు రూ. 25 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పునరావాసంతో పాటు అన్ని ప్రోత్సాహకాలు అందేలా చూస్తామని వెల్లడించారు. మావోయిస్టుల లొంగుబాటులో కీలక పాత్ర పోషించిన కొత్తగూడెం, సీఆర్‌ఫీఎఫ్ పోలీసుల చొరవ అమోఘం అని తెలిపారు.మొత్తం 86 మావోయిస్టులు మంది లొంగిపోవడం జరిగింది. సిద్ధాంతాలను వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసినందుకు పోలీసు శాఖ తరఫున వారిని ఆహ్వానిస్తున్నాం. వారు మా పోలీసు శాఖ మీద నమ్మకంతో ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వం నుంచి వారికి రావాల్సిన నగదును అందించడం జరిగింది. ఇంకా రావాల్సిన వారు కూడా హింసను వీడి వస్తే వారికి తప్పకుండా చేయూత అందిస్తామని తెలిపారు.

రేణుక ఎన్‌కౌంటర్
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ముందుకు వెళతామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో ఇంకా 95 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టులు ఉన్నారని చెప్పారు. కొద్ది రోజుల క్రితం మావోయిస్టు కీలక నేత ఉమ్మడి వరంగల్ జిల్లా కడవెండి గ్రామానికి చెందిన రేణుక ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే.మావోయిస్టుల పేరుతో అమాయక ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న వారిపై ఇటీవల కాలంలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.