ఈ ఏడాది హైదరాబాద్ లో పలు అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్నది. దీనిపై హై కోర్ట్ కూడా పలు ఆంక్షలను విధించింది. తాజాగా ఈ ఏడాది చివరి రోజు కూడా కూల్చివేతలతో హైడ్రా హడలెత్తిస్తోంది. ఖాజాగూడ చెరువు బఫర్ జోన్‌లో నిర్మించిన ఆక్రమణలను మంగళవారం నాడు హైడ్రా కూల్చివేసింది. నాలుగు ఎకరాల్లో వేసిన ఫెన్సింగ్‌ను తొలగించింది. 20కి పైగా దుకాణాలను హైడ్రా సిబ్బంది తొలగించింది.

వ్యాపారుల, స్థానికుల ఆగ్రహం
అయితే నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలను ఎలా ఖాళీ చేయాలంటూ వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. అయితే ఖాజాగూడ కూల్చివేతల వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. హడావుడిగా కూల్చివేతలు చేసి తమను రోడ్డు మీద పడేసారంటూ ఆవేదన చెందుతున్నారు.
నోటీసులు ఇచ్చినప్పటికీ అక్కడి వ్యాపారాలు దుకాణాలను ఖాళీ చేయలేదు. దీంతో ఈరోజు ఉదయమే జేసీబీలతో వచ్చిన హైడ్రా సిబ్బంది.. కూల్చివేతలు చేపట్టింది. దుకాణాల్లోని సామానులను తీసుకునే సమయం కూడా వ్యాపారులకు హైడ్రా ఇవ్వని పరిస్థితి. సామాన్లతో పాటు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి.