ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ లో ప్రత్యర్థులను వారి సొంత వేదికలపై చిత్తు చేస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తమ సొంత వేదికపై మాత్రం మరోసారి ఓటమివైపు నిలిచింది. చిన్నస్వామి స్టేడియంలో ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లో మాదిరిగానే పంజాబ్‌తోనూ అదే రిపీట్ అయింది. శుక్రవారం వర్షం అంతరాయంతో 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో ఆర్‌సీబీపై ఘన విజయం సాధించింది. ఆర్‌సీబీ నిర్దేశించిన 96 పరుగుల ఛేదనలో పంజాబ్ 12.1 ఓవర్లలో 98/5 స్కోరు చేసింది. నేహాల్ వధేరా(19 బంతుల్లో 33 నాటౌట్, 3ఫోర్లు, 3సిక్స్‌లు) జట్టు విజయంలో కీలకమయ్యాడు. హాజిల్‌వుడ్(3/14), భువనేశ్వర్(2/26) ఆకట్టుకున్నారు.తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ బ్యాటర్ల వైఫల్యంతో 14 ఓవర్లలో 95/9కే పరిమితమైంది. అనిశ్చితికి మారుపేరైన ఆర్‌సీబీ బ్యాటింగ్ లైనప్ ఓపెనర్లు నిష్క్రమించగానే పెవిలియన్‌కు క్యూ కట్టింది. సాల్ట్ (4), కోహ్లీ (1), లివింగ్‌స్టొన్ (4), జితేశ్ (2), కృనాల్ (1) అలా వచ్చి ఇలా వెళ్లారు. టిమ్ డేవిడ్ (26 బంతుల్లో 50 నాటౌట్, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), రజత్ పటీదార్ (18 బంతుల్లో 23, 1 ఫోర్, 1 సిక్స్) ఆదుకోకుంటే ఆ జట్టు పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. పంజాబ్ బౌలర్లలో మార్కో యాన్సన్ (2/10), చాహల్ (2/11), అర్ష్‌దీప్ సింగ్ (2/23), హర్‌ప్రీత్ (2/25) తలా రెండు వికెట్లు తీసి ఆర్‌సీబీని కట్టడిచేశారు.
అనుకూలంగా
ఈ మ్యాచ్‌లో మూడు తప్పిదాలు ఆర్‌సీబీ ఓటమిని శాసించాయి. టాస్ ఓడిపోవడం ఆర్‌సీబీ విజయవకాశాలను దెబ్బతీసింది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకోవడంతో ఆర్‌సీబీ ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. వర్షం కారణంగా పిచ్‌పై గంటల కొద్ది కవర్లు కప్పి ఉంచడంతో మాయిశ్చర్ ఏర్పడి వికెట్ బౌలర్లకు అనుకూలంగా మారింది. దాంతో ఆర్‌సీబీ బ్యాటర్లు పరుగులు చేయలేకపోయారు. చిన్నస్వామి స్టేడియంలో ఛేజింగ్ టీమ్స్‌కే విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సీజన్‌లో ఇక్కడ మూడు మ్యాచ్‌లు ఆడిన ఆర్‌సీబీ మూడింటిలోనూ టాస్ ఓడిపోయింది.కోహ్లీ తన శైలికి తగ్గట్లు నిదానంగా ఆడుతూ ఆఖరి వరకు క్రీజులో ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో అప్పటి వరకు స్వేచ్ఛగా ఆడిన రజత్ పటీదార్ కూడా భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాల్సి వచ్చింది. చివర్లో టీమ్ డేవిడ్ మెరుపులు మెరిపించడంతో ఆర్‌సీబీకి గౌరవప్రదమైన స్కోర్ దక్కింది. అతనికి అండగా మిడిలార్డర్‌లో ఒక్క బ్యాటర్ రాణించినా ఆర్‌సీబీ మరో 20 పరుగులు అదనంగా చేసేది. అప్పుడు మ్యాచ్ మరింత రసవత్తరంగా మారేది.

బౌలర్ల సహకారం
పంజాబ్ కింగ్స్ స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్(2/11), హర్‌ప్రీత్ బ్రార్(2/25)లు ఆర్‌సీబీ పతానాన్ని శాసించారు. కానీ ఆర్‌సీబీ స్పిన్నర్లు కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఒకే ఒక్క ఓవర్ వేసిన కృనాల్ పాండ్యా 10 పరుగులివ్వగా ఆరంభంలో కట్టడిగా వేసిన సుయాశ్ శర్మ ఆ తర్వాత ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. మూడు ఓవర్లు వేసిన అతను 25 పరుగులిచ్చుకున్నాడు. చాహల్-హర్‌ప్రీత్ బ్రార్ తరహాలో ఈ ఇద్దరూ చెలరేగి ఉంటే 96 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఆర్‌సీబీ కాపాడుకునేది. జోష్ హజెల్ వుడ్(3/14), భువనేశ్వర్ కుమార్(2/26)ల పోరాటానికి ఇతర బౌలర్ల సహకారం తోడై ఉంటే ఫలితం మరోలా ఉండేది.
Read Also:IPL 2025: తన బౌలింగ్ తో ఆకట్టుకుంటున్న చాహల్