కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడితో ఒక్కసారిగా భారత్ ఉలిక్కిపడింది. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారానికి వచ్చినవారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి తామే పాల్పడినట్టు ఉగ్రసంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది.2019లో పుల్వామా దాడి తర్వాత జమ్మూ లోయలో జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇది. ఈ ఉగ్ర దాడిని ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ దారుణమైన ఉగ్రవాద చర్యను ఖండించిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా, దీనికి స్థానికుల మద్దతు ఉందని సంచలన ఆరోపణలు చేశాడు. ‘ఈ ఉగ్రవాదులు ఎందుకు హిందువులపైనే దాడులు చేస్తున్నారు కాశ్మీరీ పండితులు లేదా భారతదేశం నలుమూలల నుంచి వచ్చే హిందూ పర్యాటకులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? స్థానిక ఉగ్రవాదుల సహాయం లేకుండా ఇటువంటి దాడులు జరగవు’అని ట్వీట్ లో రాసుకొచ్చాడు కనేరియా. అలాగే పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ కూడా పహల్గామ్ ఉగ్ర దాడిని ఖండించాడు. ‘ ఈ ఉగ్రదాడితో నా హృదయం ముక్కలైంది’ అని ట్వీట్ చేశాడు హఫీజ్.
విహారయాత్ర
ప్రత్యక్ష సాక్షి
ఫుడ్‌స్టాల్స్ వద్ద కొందరు, గుర్రాలపై స్వారీ చేస్తూ కొందరు, పచ్చిక బయలుపై కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మరి కొందరు పర్యాటకులు ఉన్న సమయంలో అడవిలో నుంచి హఠాత్తుగా ప్రత్యక్షమైన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మహిళలు, పిల్లలను వదిలిపెట్టి కంటికి కనిపించిన పురుషులను కాల్చుకుంటూ పోయారు. ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్చవద్దని మహిళలు వేడుకుంటున్నా వారు కనికరించలేదు. ఇతను ముస్లిం కాదు కాల్చేయండి అని ఓ ఉగ్రవాది అన్నట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. భర్తను, ఆప్తులను కోల్పోయిన చాలా మంది మహిళలు సాయం కోసం స్థానికులను అర్థించే దృశ్యాలు వైరల్ అయ్యాయి.,పహల్గామ్‌లో పర్యాటకులపై కొంతమంది ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులు జరిపారు. ఈ సమయంలో, పర్యాటకులను వారి మతం గురించి అడిగి, వారు హిందువులని తెలుసుకున్న తర్వాత ఉగ్రవాదులు వారిని కాల్చి చంపారని తెలుస్తోంది. ఈ ఉగ్రదాడిలో ఇప్పటివరకు 28 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది కాశ్మీర్‌కు విహారయాత్రకు వచ్చిన వారే. దీంతో కోపోద్రిక్తులైన భారతీయులు,ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు చేస్తున్నారు. ఉగ్రవాదులతో పాటు కాశ్మీర్‌లో ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న పాకిస్తాన్‌కు కూడా గుణపాఠం చెప్పాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
విడుదల
ఈ దాడి నేపథ్యంలో పహల్గాంలో ఎన్ఐఏ బృందం స్థానిక పోలీసులకు సాయంగా అక్కడకు చేరుకుంది. కాల్పులు జరిపారని అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తుల స్కెచ్‌లు విడుదల చేశారు.పర్యాటక, ట్రెక్కింగ్ సీజన్ ఊపందుకుంటున్న సమయంలో ఉగ్రదాడి చోటుచేసుకోవడం ఆందోళనకలిగిస్తోంది. పర్యాటక రంగానికి ఇది తీవ్రమైన దెబ్బగా మారుతుందని, ఈ పరిశ్రమపై ఆధారపడే స్థానికుల జీవనాధారంపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
Read Also:All-party meeting : ఉగ్రదాడి ఘటన…నేడు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం