తిరుపతిలోని తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు అన్నీ సౌకర్యాలు ఒకేచోట లభించేలా తిరుపతిలో కోసం కొత్త బస్టాండ్ రాబోతోంది. ప్రస్తుత బస్టాండ్ స్థానంలోనే అత్యాధునిక అల్ట్రా మోడల్ బస్ టెర్మినల్(Ultra Model Bus Terminal) నిర్మించనున్నారు. భక్తులకు అన్ని వసతులు ఒకే చోట అందించేలా ఇది ఉంటుంది. దాదాపు రూ.500 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇందులో బస్టాండ్‌తో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు కూడా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ స్థలాన్ని ఇవ్వనుండగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (NHLMML) కొంత పెట్టుబడి పెడుతుంది. ప్రైవేటు సంస్థ ద్వారా మిగిలిన నిధులను సమకూరుస్తారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ప్రతిబింబించేలా దీని డిజైన్ ఉంటుంది.ప్రస్తుతం ఉన్న తిరుపతి బస్టాండ్ 13.18 ఎకరాల్లో ఉంది. కొత్త టెర్మినల్‌ను 12.19 ఎకరాల్లో నిర్మిస్తారు. ప్రస్తుత బస్టాండ్‌కు మూడు వైపులా రోడ్లు ఉన్నాయి. కొత్త టెర్మినల్(New terminal)కు మాత్రం నాలుగు వైపులా రోడ్లు ఉండేలా డిజైన్ చేశారు. కొత్త బస్టాండ్‌లో రెండు అంతస్తుల సెల్లార్ ఉంటుంది. ఈ సెల్లార్‌లో బైక్‌లు, కార్లు పార్కింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం బస్టాండ్‌కు కేటాయిస్తారు. ఇక్కడ 98 ప్లాట్‌ఫామ్‌లతో పెద్ద బస్టాండ్ ఉంటుంది. అంతేకాదు, 50 బస్సులు పార్కింగ్ చేయడానికి, ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ కోసం కూడా ఏర్పాట్లు చేస్తారు.

పెట్టుబడి
మొదటి, రెండో అంతస్తుల్లో కొంత భాగాన్ని RTC కార్యాలయాలకు ఇస్తారు. మిగిలిన స్థలంలో ఫుడ్‌కోర్టులు, దుకాణాలు ఉంటాయి. మూడో అంతస్తును సర్వీసుల కోసం వదిలేస్తారు. అంటే భవనానికి సంబంధించిన విద్యుత్ పనులు, సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ వంటివి ఇక్కడ ఉంటాయి. నాలుగు నుంచి ఏడో అంతస్తు వరకు హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు, ఇతర వ్యాపార అవసరాలకు ఉపయోగిస్తారు. ఎనిమిది, తొమ్మిది, పదో అంతస్తుల్లో బ్యాంకులు, ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల కార్యాలయాలు ఉంటాయి. పదో అంతస్తు పైన హెలికాప్టర్ దిగడానికి హెలిప్యాడ్ కూడా నిర్మిస్తారు. మొత్తం మీద 1.54 లక్షల చదరపు అడుగుల మేర బిల్డింగ్(Building) ఉంటుంది.ఈ ప్రాజెక్టులో RTC విలువైన స్థలాన్ని ఇస్తున్నందన పెట్టుబడి పెట్టడం లేదు. NHLMML కొంత, కాంట్రాక్ట్ సంస్థ కొంత పెట్టుబడి పెడతాయి. ప్రాజెక్టు పూర్తయ్యాక హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు, బ్యాంకులు, కార్యాలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని RTC, NHLMML, కాంట్రాక్టర్ సంస్థ పంచుకుంటాయి. ఎవరికి ఎంత వాటా వస్తుందనేది ఒప్పందం చేసుకుంటారు.బస్టాండ్ నిర్మాణం జరిగే సమయంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూస్తారు. ప్రస్తుత బస్టాండ్‌ను రెండు, మూడు చోట్లకు మారుస్తారు. కొన్ని బస్సులను మంగళం డిపోకి పంపుతారు. అలిపిరి దగ్గర టీటీడీ (TTD) స్థలం, తిరుచానూరు మార్గంలో కొన్ని చోట్ల తాత్కాలిక బస్టాండ్లు ఏర్పాటు చేస్తారు.
Read Also : IRCTC: ఐఆర్సీటీసీ కొత్త ప్యాకేజీలు..మే 22 నుంచే ప్రారంభం