తమిళ సినీ నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ చుట్టూ కోలీవుడ్ నుంచి కోట వరకు రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు ఉంటుందనే అర్థం వచ్చేలా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే, ఈ మద్దతు ప్రతిపాదనను తమిళనాడు పీసీసీ చీఫ్ సెల్వపెరుంతగై సున్నితంగా తిరస్కరించడమే కాకుండా, తనదైన శైలిలో సెటైర్లు వేశారు. విజయ్ వంటి కొత్త శక్తుల నుంచి తమకు ఎలాంటి అదనపు ‘బూస్ట్’ అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీ స్వశక్తితోనే బలంగా ఉందని ఆయన స్పష్టం చేయడం విశేషం.
Supersonic: కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
సెల్వపెరుంతగై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “మా క్యాడర్‌ను చూడండి.. వారు ఇప్పటికే పూర్తి ఉత్సాహంతో (బూస్ట్స్) ఉన్నారు. మా నాయకుడు రాహుల్ గాంధీ మాకు కావాల్సిన బూస్ట్, హార్లిక్స్, బోర్న్ వీటా అన్నీ ఇస్తున్నారు” అంటూ ఆయన ఎద్దేవా చేశారు. అంటే, కాంగ్రెస్ కార్యకర్తలకు బయటి వ్యక్తుల నుంచి ప్రోత్సాహం అవసరం లేదని, రాహుల్ గాంధీ నాయకత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. కొత్తగా పార్టీ పెట్టిన విజయ్‌ను ఉద్దేశించి “మేము ఎవరి మీదో ఆధారపడే స్థితిలో లేము” అనే సంకేతాన్ని పంపడమే కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది.

ఈ వివాదంపై అటు విజయ్ గానీ, ఇటు TVK పార్టీ శ్రేణులు గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించకపోవడం గమనార్హం. గతంలో కూడా చంద్రశేఖర్ తన కుమారుడి రాజకీయ అడుగుల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోవడం, ఆ తర్వాత విజయ్ వాటిని ఖండించడం వంటివి జరిగాయి. ఈసారి కూడా తండ్రి చేసిన వ్యాఖ్యలతో విజయ్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారా? లేక ఇది కేవలం రాజకీయ వ్యూహంలో భాగమా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా, రాబోయే ఎన్నికల నాటికి తమిళనాడులో పొత్తుల సమీకరణాలు ఏ విధంగా మారతాయో అనేదానికి ఈ ‘బూస్ట్’ వివాదం ఒక చిన్న ఉదాహరణగా నిలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com