బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్జేడీ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మోహనియా నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమైన శ్వేతా సుమన్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో ఆ నియోజకవర్గంలో ఆర్జేడీకి పోటీ హక్కు కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఈ పరిణామం పార్టీ శ్రేణుల్లో ఆందోళన రేపింది. శ్వేతా సుమన్ నామినేషన్ తిరస్కరణకు కారణాలపై స్పష్టత రాలేదు కానీ, అధికార వర్గాలు సాంకేతిక లోపాలు ఉన్నాయన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Breaking News – Thama Movie Collections : రష్మిక ‘థామా’ తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?
నామినేషన్ తిరస్కరణ అనంతరం శ్వేతా సుమన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం నుంచి బయటకు వస్తూ కన్నీళ్లపర్యంతమయ్యారు. మీడియాతో మాట్లాడిన ఆమె, “నా నామినేషన్‌లో ఎలాంటి లోపం లేదు. ఢిల్లీ నుంచి వచ్చిన రాజకీయ ఒత్తిడి కారణంగానే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ, “ఇది న్యాయపరంగా తప్పు నిర్ణయం. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. దీని మీద నేను కోర్టులో పోరాడతాను” అని ప్రకటించారు. ఆమె ఆవేదనతో మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ, ఎన్నికల కమిషన్ చర్యలపై ప్రజల్లో చర్చ మొదలైంది.

ఆర్జేడీ నేతలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. పార్టీ ప్రతినిధులు ఎన్నికల కమిషన్‌ను తప్పుబడుతూ, రాజకీయ ఉద్దేశ్యపూర్వక చర్యగా అభివర్ణించారు. “ప్రజల మద్దతుతో ముందుకు సాగుతున్న ఆర్జేడీని అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయి” అని పార్టీ వర్గాలు ఆరోపించాయి. మరోవైపు, బిహార్ ఎన్నికల అధికారులు మాత్రం తమ నిర్ణయం పూర్తిగా చట్టబద్ధమైనదని స్పష్టం చేశారు. అన్ని పత్రాలు పరిశీలించిన తర్వాతే నామినేషన్ తిరస్కరణ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ ఘటనతో మోహనియా నియోజకవర్గం ఎన్నికల పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. శ్వేతా సుమన్ న్యాయపోరాటం ఎటువంటి మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.