రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు భారతీయ సమాజంలో సామాజిక సమానత్వంపై మరింత చర్చకు దారి తీశాయి. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఐదు రోజుల పర్యటనలో భాగంగా భగవత్ హిందూ సమాజంలోని విభజనలను, ముఖ్యంగా కులవ్యవస్థ వల్ల కలిగిన భేదాభిప్రాయాలను తొలగించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.

ఒకే ఆలయం, ఒకే బావి, ఒకే శ్మశానం
ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 17 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో పర్యటిస్తున్న భగవత్ హెచ్‌బీ ఇంటర్ కాలేజ్, పంచన్ నగ్రీ పార్క్‌లోని రెండు శాఖల్లోని స్వయం సేవకులతో వేర్వేరుగా మాట్లాడారు. భగవత్ తన ప్రసంగంలో హిందువులందరూ ఒకే ఆలయాన్ని దర్శించాలి, ఒకే బావిలో నీటిని వాడుకోవాలి, ఒకే శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహించుకోవాలి అనే మూడు ప్రధానమైన సిద్ధాంతాలను ప్రతిపాదించారు. ఈ మూడు అంశాల ద్వారా సమాజంలోని అన్ని వర్గాల మధ్య ఉండే భిన్నతలను తొలగించేందుకు దోహదపడతాయని ఆయన అభిప్రాయం. ఈ సూత్రం ప్రధానంగా హిందూ సమాజంలోని కులపరమైన విభజనలను కూల్చి వేయాలని కోరుతున్న సంకేతంగా నిలిచింది. గతంలో భిన్నమైన కులాల వారికి ఆలయ ప్రవేశం, నీటి వనరులపై హక్కు, శ్మశాన వాడకంపై అనేక ఆంక్షలు ఉండేవి. అటువంటి స్థితి నుంచి సమానత్వానికి దారి తీసే మార్గం ఇది. విలువలే హిందుత్వానికి పునాది అని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. హిందూ ధర్మం కేవలం ఆచారాలతో పాటు మానవతా విలువలతో కూడి ఉండాలన్నది ఆయన ధోరణి. సంప్రదాయం, సాంస్కృతిక బోధన, మరియు నైతిక ప్రాథమికతల ఆధారంగా హిందూ సమాజం అభివృద్ధి చెందాలి అని ఆయన ఆకాంక్షించారు. ఇది హిందుత్వాన్ని ఒక నిర్దిష్ట కులం లేదా వర్గానికి పరిమితం చేయకుండా, ఒక సమూహ మానవత్వ దృక్పథంగా అభివృద్ధి చేయాలన్న సూచనగా అభివర్ణించవచ్చు.
Read also: Ex-Karnataka Police Chief : భార్యే హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం