దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్య సమస్యతో గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రంగా పోరాడుతోంది. వాతావరణంలో ఉన్న ఘాతకంగా మారుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రం, రాష్ట్రం సంయుక్తంగా పలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా, ఈ నేపథ్యంలో ఢిల్లీ వాయు నాణ్యత నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1, 2025 నుంచి అమల్లోకి వచ్చే ఈ నిబంధన ప్రకారం, కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం నింపడాన్ని పూర్తిగా నిషేధించారు.కాలం చెల్లిన (ఎండ్-ఆఫ్-లైఫ్) వాహనాలకు ఇంధనం నింపడాన్ని నిషేధిస్తూ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం) ఉత్తర్వులు జారీ చేసింది.దీని ప్రకారం 10 సంవత్సరాలు దాటిన డీజిల్ వాహనాలకు, 15 సంవత్సరాలు దాటిన పెట్రోల్ వాహనాలకు ఢిల్లీలోని ఏ ఇంధన కేంద్రంలోనూ ఫ్యూయల్ నింపరు.కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ కఠిన నిబంధనను అమలు చేయనున్నారు.
కాలం చెల్లిన వాహనాలను గుర్తించారు
ఇందుకోసం ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న ఇంధన కేంద్రాల వద్ద ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్‌పీఆర్) కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 500 ఇంధన కేంద్రాలలో 500 ఏఎన్‌పీఆర్ కెమెరాలను అమర్చారు. ఈ వ్యవస్థ ద్వారా ఇప్పటివరకు 3.63 కోట్ల వాహనాలను స్క్రీన్ చేయగా, సుమారు 5 లక్షల కాలం చెల్లిన వాహనాలను గుర్తించారు. అంతేకాకుండా, 29.52 లక్షల వాహనాలు తమ పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్లను (pucc) పునరుద్ధరించుకున్నాయి. నిబంధనలు ఉల్లంఘించినవారికి మొత్తం రూ. 168 కోట్ల విలువైన చలాన్లు జారీ చేశారు. ఈ నిబంధనల అమలును మరింత పటిష్టం చేసేందుకు ఢిల్లీ రవాణా శాఖ 100 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఈ బృందాలు వాహనాల డేటాను పర్యవేక్షిస్తూ, నిబంధనలు పాటించని వాహనాలను గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటాయి.

చుట్టుపక్కల ప్రాంతాల్లో
ఈ మార్గదర్శకాలను ఢిల్లీతో పాటు ఇతర ఎన్‌సీఆర్ నగరాలైన గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, సోనిపట్‌లలో నవంబర్ 1 నుంచి అమలు చేయనున్నారు. మిగిలిన ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ఏప్రిల్ 2026 నుంచి ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ చర్యల ద్వారా ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని (Air pollution) గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు.ఈ నిబంధనలు అన్ని పెట్రోల్ బంకులకు వర్తిస్తాయి.తాజా నిర్ణయం వాయు నాణ్యత మెరుగుపరచడంలో ఓ కీలక మైలురాయిగా భావించవచ్చు. వాతావరణాన్ని రక్షించడం కోసం ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయం ఇది. ఈ నిర్ణయం వల్ల తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, దీర్ఘకాలికంగా ఆరోగ్యకరమైన జీవన శైలి సాధ్యపడుతుంది.
Read Also: America: America: భారత్ వచ్చే పౌరులకు అమెరికా ట్రావెల్ అడ్వైజరీ జారీ