కేంద్ర ప్రభుత్వం, విద్యార్థులు హిందీ, ఇంగ్లీషు భాషలతో పాటు ఒక స్థానిక భాష నేర్చుకోవాలని త్రిభాషా విద్యా విధానం తీసుకు వచ్చింది.దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అంతా హిందీ, ఇంగ్లీషు భాషలతో పాటు ఓ స్థానిక భాషను కూడా నేర్చుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం త్రిభాషా విద్యా విధానాన్ని తీసుకు వచ్చింది. జాతీయ విద్యా విధానంలో భాగమైన ఈ సూత్రాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని కూడా వివరించింది. అయితే కొన్ని రాష్ట్రాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బలవంతంగా భాషలు రుద్దడం సరికాదంటూ తాము ఈ విధానాన్ని అమలు చేయమని చెబుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళలు కేంద్రంతో గొడవకు దిగగా ఇటీవలే ఓ న్యాయవాది సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ మూడు రాష్ట్రాలు కచ్చితంగా ఈ విధానాన్ని అమలు చేసేలా చూడాలంటూ పిటిషన్ వేయగా సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసింది. విద్యావిధానాన్ని అమలు చేయాలని ఏ రాష్ట్రాన్ని బలవంతం లేయలేమని తేల్చి చెప్పింది.
వివరాలు
జాతీయ విద్యా విధానంపై తమిళనాడు,కేంద్ర ప్రభుత్వం మధ్య తీవ్ర వివాదం సాగుతోంది. విద్యార్థులకు అన్ని భాషలు నేర్పిస్తే మంచిదని కేంద్రం చెబుతుండగా, తమ ప్రాంతానికి, భాషకు, ప్రజలకు నష్టం కల్గించే చర్యలను అస్సలే అనుమతించబోమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(M K Stalin) చెబుతున్నారు. కానీ దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం దీన్ని అమలు చేస్తేనే మీ రాష్ట్రానికి నిధులు మంజూరు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు పశ్చమ బెంగాల్, కేరళలు కూడా ఈ విద్యా విధానాన్ని అమలు చేయబోమని తేల్చి చెప్పాయి. దీంతో ఓ న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలు రాజ్యాంగ పరంగా విద్యా విధానాన్ని అమలు చేసేలా చూడాలంటూ అందులో పేర్కొన్నారు.అలాగే దేశ వ్యాప్తంగా విద్యలో కేంద్రం ఎన్ఈపీ విధానాన్ని(NEP policy)అమలు చేయాలని చూస్తోందని, కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం దీన్ని రాజకీయ సమస్యగా మారుస్తున్నాయని ఆరోపించారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు ఈ హక్కును దూరం చేస్తున్నాయని వివరించారు. కానీ దీన్ని అరికట్టి దేశంలోని విద్యార్థులు అందరికీ ప్రభావవంతమైన విద్య పొందేలా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అయితే దీన్ని నేడు సుప్రీం కోర్టు పరిశీలించింది. ఈక్రమంలోనే పిటిషనర్‌కు ఈ కేసుతో గల సంబంధం ఏంటో చెప్పాలని ప్రశ్నించింది.

స్పందించిన
పిటిషనర్ బదులిస్తూ తాను తమిళనాడుకు చెందిన వ్యక్తినని,ప్రస్తుతం ఢిల్లీలో స్థిరపడ్డానని చెప్పారు. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం,దేశ రాజధానిలో స్థిరపడ్డప్పుడు వివిధ రాష్ట్రాలో జాతీయ విద్యావిధానం అమలు గురించి పిటిషన్ వేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది.అలాగే ఆయన వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ మీ పిల్లలు ఢిల్లీలో హిందీ నేర్చుకోవడం కొనసాగించవచ్చని పిటిషనర్‌కు తెలిపింది. అలాగే విద్యా విధానాన్ని అమలు చేయాలని ఏ రాష్ట్రాన్ని తాము బలవంతం చేయలేమని జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. కానీ రాష్ట్ర సర్కారు తీసుకునే చర్యల వల్ల పౌరుల ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన జరిగితే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని వివరించింది.
Read Also :Live broadcast: రక్షణ, భద్రతా ఆపరేషన్లపై ప్రత్యక్ష ప్రసారాలు వద్దు: కేంద్ర రక్షణ శాఖ