దేశ రాజధాని ఢిల్లీలో గురువారం రోజు ఎన్నికలు జరగబోతుండగా.. ప్రస్తుత ముఖ్యమంత్రి అతిశీకి పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై కేసు నమోదు చేశారు. అలాగే ఆమె మద్దతు దారులైన మరో ఇధ్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు ఓ హెడ్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడగా.. వారిపై కూడా కేసులు నమోదు చేశారు. దీంతో ఆప్ నేతలంతా.. పోలీసులు కావాలనే తమపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు.

గురువారం రోజే ఢిల్లీలో ఎన్నికలు జరగబోతుండగా.. మంగళ వారం రోజు పోలీసులు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై రెండు కేసులు నమోదు చేశారు. అందులో ఒకటి ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీపై కాగా.. మరో కేసు ఆప్ మద్దతుదారులపై. సోమవారం రోజు రాత్రి.. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ పది వాహనాల్లో 60 మంది మద్దతుదారులతో కలిసి ఫతేసింగ్ మార్గ్‌కు చేరుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు ఆమెను తిరిగి వెళ్లిపోవాలని సూచించారు. అయితే అతిశీ తిరిగి వెళ్లేందుకు నిరాకరించారు.
ఈక్రమంలోనే గోవింద్‌పురి పోలీస్ హెడ్ కానిస్టేబుల్.. ఆప్ నేతలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తుండగా వీడియో తీశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సీఎం అతిశీ మద్దతుదారులు అష్మిత్, సాగర్ మెహతాలు హెడ్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డారు. ఇద్దరూ కలిసి అతడిని కొట్టగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలోనే అష్మిత్, సాగర్ మెహతాలపై కేసులు నమోదు చేశారు. మరోవైపు ఎన్నికల కోడ్ నియమావళిని ఉల్లంఘించిన సీఎం అతిశీపై కేసు పెట్టారు.