టాలీవుడ్ యువ నటులు సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ చిత్రం మసూద. హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించగా సాయి కిరణ్ దర్శకత్వం వహించాడు. నవంబర్ 18 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌ను అందుకుంది. అయితే ఈ సినిమా ప్రస్తుతం తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే తెలుగులో మాత్రమే ఈ సినిమా అందుబాటులో ఉండడంతో వేరే భాష ప్రేక్షకులకు రీచ్ కాలేకపోయింది. అయితే ఈ మూవీ వచ్చిన దాదాపు 3 ఏండ్ల తర్వాత మరో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిత్రం. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియలో ఈ చిత్రం ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
కథ విషయానికి వస్తే
నీలం (సంగీత) ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తూ, భర్త అబ్దుల్ (సత్య ప్రకాశ్) నుంచి విడిపోయి, తన కూతురు నాజియా (బాంధవి శ్రీధర్)తో కలిసి ఒక అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటుంది. అదే అపార్ట్‌మెంట్‌లో నివసించే గోపీ (తిరువీర్) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తన సహోద్యోగి మినీ (కావ్యా కళ్యాణ్ రామ్)ను ప్రేమిస్తాడు, కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పడానికి భయపడతాడు. ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉండడం వల్ల గోపీ, నీలం కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతాడు. అప్పుడప్పుడు నీలం, నాజియాతో కలిసి గోపీ బయటకు వెళ్తుంటాడు. ఒక రోజు నాజియా విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. అర్ధరాత్రి వేళ ఏవో వింత మాటలు మాట్లాడుతుంది. కూతురి పరిస్థితిని చూసి భయపడిన నీలం, గోపీ సహాయం కోరుతుంది. నాజియా ప్రవర్తనను గమనించిన గోపీ, ఆమెకు దెయ్యం పట్టి ఉంటుందని అనుమానిస్తాడు. ఆమెను రక్షించడానికి వారు అనేక ప్రయత్నాలు చేస్తారు. చివరకు అల్లా ఉద్దీన్ (సత్యం రాజేశ్) సలహాతో పీర్ బాబా (శుభలేఖ సుధాకర్)ను సంప్రదిస్తారు. ఈ తర్వాత గోపీ, నీలంలకు ఎదురైన సవాళ్లు ఏమిటి? నాజియా శరీరంలోకి దెయ్యం ఎలా ప్రవేశించింది? మసూద ఎవరు, ఆమె నేపథ్యం ఏమిటి? మసూదను మీర్ చాచా ఎందుకు చంపాడు? నాజియాను కాపాడేందుకు గోపీ చేసిన సాహసం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే,‘మసూద’ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
హార్రర్ సినిమాలు అంటే ఎక్కువగా హిందూ సంప్రదాయం నేపథ్యంలో ఉంటాయి. ‘మసూద’లో డిఫరెన్స్ ఏంటంటే కథంతా ముస్లిం నేపథ్యంలో సాగుతుంది. ఆత్మలను వదిలించడానికి సాధువులు, అఘోరాలు పూజలు చేయడం హార్రర్ సినిమాల్లో చూసుంటాం. ‘అరుంధతి’లో షాయాజీ షిండే రోల్ తావీదులు కట్టినా అందులోనూ హిందూ పూజలు ఎక్కువ. కానీ, ‘మసూద’ అంతా ముస్లిం నేపథ్యంలో సాగడంతో పీర్ బాబాలు ఆత్మలను వదిలించడానికి ఇస్లాం నేపథ్యంలో పూజలు చేయడం, మసీదులో మంత్రించిన కత్తితో దెయ్యాన్ని అంతం చేయడానికి చూపించడం వంటివి ఉంటాయి.’మసూద’లో ముస్లిం నేపథ్యం సన్నివేశాలను తెరకెక్కించిన తీరు కొంచెం కొత్తగా ఉంటుంది. కథ విషయానికి వస్తే ఆ కొత్తదనం తక్కువ. కథను నడిపించిన తీరు కూడా సాధారణంగా ఉంటుంది. ప్రథమార్థంలో దర్శకుడు పాత్రలను పరిచయం చేయడానికి మాత్రమే వాడుకున్నారు. దాంతో కథ ముందుకు కదలదని ఫీలింగ్ ఉంటుంది. నిడివి ఎక్కువైనా కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. విశ్రాంతి తర్వాత అసలు కథ మొదలైంది. కథ సాధారణంగా అనిపించినా సన్నివేశాలు బావున్నాయి. చివరి అరగంట ఉత్కంఠ కలిగిస్తుంది. అందుకు ఛాయాగ్రహణం, సంగీతం ప్రధాన కారణమని చెప్పాలి. ఏదో జరుగబోతుందనే ఉత్కంఠను అలా కొనసాగించారు.
Read Also: Kashmir : పహల్గాంలో ఉగ్రదాడి స్పందించిన సినీ ప్రముఖులు