సీనియర్ జర్నలిస్టు, కొమ్మినేని శ్రీనివాసరావు (కేఎస్ఆర్) తాజాగా చేసిన వ్యాఖ్యలు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల తాను ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల్లో తనకు అండగా నిలిచిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతీరెడ్డికి కొమ్మినేని శ్రీనివాసరావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తాను నిర్దోషిగా బయటపడటానికి వారి చొరవే కారణమని, వారు అందించిన సహకారం వల్లే తాను మళ్లీ ప్రజల ముందుకు రాగలిగానని పేర్కొన్నారు.
ఇది సాధ్యమైందని
తాను ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల గురించి, ఆ సమయంలో తనకు అండగా నిలిచిన వారి గురించి కొమ్మినేని శ్రీనివాసరావు తన మనోభావాలను పంచుకున్నారు. తాను మధ్యతరగతికి చెందిన వ్యక్తినని, సుప్రీంకోర్టు (Supreme Court) వరకు వెళ్లడం తన ప్రతిభ కాదని, కేవలం వారి చొరవ, న్యాయం కోసం వారు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందని కేఎస్ఆర్ స్పష్టం చేశారు. ఈ పోరాటంలో సహకరించిన సుప్రీంకోర్టు, మంగళగిరి కోర్టులోని న్యాయవాద బృందానికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.
కుట్ర జరగడం
తనకు లభించిన ప్రజాదరణ చూసి ఆశ్చర్యపోయానని, భిన్నమైన భావజాలాలున్న వారు సైతం తనను కలిసి ఆవేదన వ్యక్తం చేసిన తీరు మర్చిపోలేనని కొమ్మినేని (Kommineni Srinivas) పేర్కొన్నారు. “నా 50 ఏళ్ల జర్నలిజం కెరీర్‌లో ఎప్పుడూ రాని మచ్చతో జీవితాన్ని చాలించాల్సి వస్తుందేమోనని బాధపడ్డాను. అరెస్టులకు భయపడి కాదు, నా వ్యక్తిత్వం, విశ్వసనీయత దెబ్బతీసేలా కుట్ర జరగడం నన్ను చాలా ఆవేదనకు గురిచేసింది” అని ఆయన విచారం వ్యక్తంచేశారు.

కొమ్మినేని భావోద్వేగంగా
కొందరు తన ఊపిరి తీయాలని చూస్తే జగన్, భారతి తనకు ఊపిరి పోసి పునర్జన్మనిచ్చారని కొమ్మినేని భావోద్వేగంగా అన్నారు. “వారికి నా శతకోటి దండాలు. ఊపిరి తీయడం సులభం, కానీ ఊపిరి పోయడం కష్టం. అలాంటిది వారు నాకు మళ్లీ ఈ అవకాశం కల్పించారు” అని తెలిపారు. తాను జైల్లో ఉన్న సమయంలో కూడా ‘కేఎస్ఆర్ లైవ్ షో’ను అదే బ్రాండ్‌తో కొనసాగించడం తన పట్ల వారికి ఉన్న గౌరవాభిమానాలను తెలుపుతోందని, వారికి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదని అన్నారు.
తెలిసిన వారు
కొందరు మిత్రులు, తనతో కలిసి పనిచేసిన సహచరులే తనకు వ్యతిరేకంగా వార్తలు రాయడం, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తనను బాధించిందని కేఎస్ఆర్ (KSR) అన్నారు. “నా గురించి బాగా తెలిసిన వారు కూడా ఇలా చేయడం ఆశ్చర్యం కలిగించింది. విమర్శించడం తప్పుకాదు, కానీ లేనివి, అబద్ధాలు సృష్టించకూడదు. మీడియా పవిత్రంగా ఉండాలి” అని ఆయన హితవు పలికారు. తాను ఎవరినీ నిందించడం లేదని, ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతానికి కేసుల జోలికి వెళ్లకుండా, తన మనోవేదనను పంచుకునేందుకే ఈ అవకాశం తీసుకున్నానని కొమ్మినేని శ్రీనివాసరావు వివరించారు.
Read Also: Alluri District: అల్లూరి జిల్లాలో ఎన్‌కౌంటర్..ముగ్గురు మావోయిస్టులు మృతి