విజయం
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025లో భాగంగా సౌతాఫ్రికాతో శనివారం ముగిసిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ గెలుపుతో సౌతాఫ్రికా 27 ఏళ్ల కలను సాకారం చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న ఐసీసీ టైటిల్ (ICC title) ను అందుకుంది. తమపై పడిన చోకర్స్ ముద్రను ఈ విజయంతో చెరిపేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ప్యాట్ కమిన్స్ (Pat Cummins) సౌతాఫ్రికా జట్టుపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ విజయానికి వారు పూర్తి అర్హులని కితాబిచ్చాడు.
అద్భుత ప్రదర్శన
కొన్ని విషయాల్లో తమ జట్టు విఫలమైందని, మార్క్‌రమ్, బవుమా తమకు అవకాశం ఇవ్వలేదని చెప్పాడు.’పరిస్థితులు త్వరగా మారుతాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో చాలా వేగంగా పరిస్థితి మా చేయి ధాటిపోయింది. మేం కొన్ని విషయాల్లో మెరుగ్గా రాణించలేదు. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం తర్వాత ప్రత్యర్థిని త్వరగా ఔట్ చేయలేకపోయాం. నాలుగో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా మాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మా టాప్-7లో కొన్ని సమస్యలు ఉన్నాయి. గత రెండేళ్లుగా మా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. తొలి రెండు రోజులు మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మేం ప్రతీది ప్రయత్నించాం.

ఎలాంటి అవకాశం
నాథన్ లయన్ బాగానే బౌలింగ్ చేశాడు. కానీ అతనికి వికెట్ దక్కలేదు. మార్క్‌రమ్, బవుమా మాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. సౌతాఫ్రికా జట్టు తమ సత్తా ఏంటో చాటి చెప్పింది. ఈ విజయానికి వారు పూర్తి అర్హులు. ఈ మ్యాచ్ అసాంతం వారు పట్టు వదల్లేదు. టెస్ట్ క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. ఫైనల్‌కు చేరడమే గొప్ప ఘనత. రెండేళ్ల పాటు సాగిన టోర్నీని షూటౌట్ తరహాలో ఒక్క మ్యాచ్‌తోనే ఫలితం తేల్చడం అద్భుతం. ఫలితం మాకు అనుకూలంగా లేదు. కానీ ఇదో గొప్ప వారం.’అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.
మార్క్‌రమ్
213/2 ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగు రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా 85 ఓవర్లలో 5 వికెట్లకు 283 పరుగులు చేసి గెలుపొందింది. మార్క్‌రమ్(207 బంతుల్లో 14 ఫోర్లతో 136) శతకంతో సఫారీ విజయంలో కీలక పాత్ర పోషించగా టెంబా బవుమా(134 బంతుల్లో 5 ఫోర్లతో 66), డేవిడ్ బెడింగ్‌హమ్(49 బంతుల్లో ఫోర్‌తో 21 నాటౌట్) అతనికి అండగా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా ప్యాట్ కమిన్స్, జోష్ హజెల్‌వుడ్ చెరో వికెట్ పడగొట్టారు.సంక్షిప్త స్కోర్లు:ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 212 ఆలౌట్,సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 138 ఆలౌట్,ఆసీస్ రెండో ఇన్నింగ్స్: 207 ఆలౌట్,సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 83.4 ఓవర్లలో 282/5.