అమెరికన్ల ఉద్యోగాలకే తొలి ప్రాధాన్యమన్న అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‌పై మరోసారి తనదైన శైలిలో ఒత్తిడి పెంచారు. ఐఫోన్ల(IPhone)ను భారత్‌లో కాకుండా అమెరికా(America)నే తయారు చేయాలని, లేనిపక్షంలో దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. భారత్ సుంకాలు లేని ఒప్పందాలను ప్రతిపాదించినప్పటికీ, దేశీయంగానే ఉత్పత్తి జరగాలన్నది తన కోరిక అని ట్రంప్ తేల్చిచెప్పారు.

సరే, భారత్ కు వెళతారా.. వెళ్లండి…
అణుశక్తిపై కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసే కార్యక్రమం కోసం వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్‌లో ఉన్న సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌తో జరిగిన సంభాషణను ప్రస్తావిస్తూ, “టిమ్ ఇలా చేయరని నేను భావించాను. భారత్‌లో ప్లాంట్లు నిర్మించబోతున్నట్లు ఆయన చెప్పారు. ‘సరే, భారత్ కు వెళతారా.. వెళ్లండి… కానీ సుంకాలు లేకుండా ఇక్కడ (అమెరికాలో) అమ్మలేరు’ అని నేను చెప్పాను” అని ట్రంప్ తెలిపారు. ఐఫోన్ల గురించి తాము మాట్లాడుతున్నామని, వాటిని అమెరికాలో అమ్మాలంటే, అవి అమెరికాలోనే తయారుకావాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన నొక్కి చెప్పారు.
సుంకం బెదిరింపు
మొదట ఆపిల్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించిన ట్రంప్, ఆ తర్వాత ఈ సుంకం బెదిరింపును శాంసంగ్, హువావే వంటి అన్ని స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలకు వర్తింపజేస్తూ, “ఆ ఉత్పత్తిని తయారుచేసే ఎవరికైనా ఇది వర్తిస్తుంది, లేకపోతే అది న్యాయంగా ఉండదు” అని అన్నారు. ఈ సుంకాలు 2025 జూన్ నెలాఖరు నాటికి అమల్లోకి వస్తాయని తెలుస్తోంది.
అమెరికాలోనే తయారవ్వాలని కోరుతున్నాను..
అదే రోజు అంతకుముందు ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో కూడా ట్రంప్ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. “అమెరికాలో విక్రయించే వారి ఐఫోన్లు భారత్‌లోనో, మరే ఇతర దేశంలోనో కాకుండా అమెరికాలోనే తయారవ్వాలని నేను ఆశిస్తున్నాను. అలా జరగని పక్షంలో, ఆపిల్ కనీసం 25 శాతం సుంకాన్ని అమెరికాకు చెల్లించాలి. అమెరికన్ల ఉద్యోగాలకే మొదటి ప్రాధాన్యం!” అని ఆయన రాశారు.